Tuesday, August 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగీత కార్మికులకిచ్చిన హామీలు అమలు చేయాలి

గీత కార్మికులకిచ్చిన హామీలు అమలు చేయాలి

- Advertisement -

ఎక్స్‌గ్రేషియా బకాయిలు 
విడుదల చేయాలి : సీపీఐ(ఎం)
 రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
జనగామకు చేరుకున్న
 గీతన్నల చైతన్య యాత్ర
నవతెలంగాణ-జనగామ

​రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల సమస్యలు, వృత్తిని ఆధునీకరించి అభివద్ధి చేస్తామన్న హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర సోమవారం జనగామ జిల్లాకు చేరుకుంది. సూర్యాపేట రోడ్డు నెల్లుట్ల శివారు నుంచి జనగామ పట్టణంలో డప్పు చప్పుళ్లు, నృత్యాలతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో జాన్‌వెస్లీ మాట్లాడారు.

తాటి చెట్లపై నుంచి పడి మృతిచెందిన, వికలాంగులైన గీత కార్మికులకు చెల్లించాల్సిన ఎక్స్‌గ్రేషియా బకాయిలు సుమారు రూ.20కోట్లు ఉన్నాయని తెలిపారు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం గీత కార్మికులకు చెల్లించాల్సిన ఎక్స్‌గ్రేషియా కోసం నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. నీరా ప్రాజెక్టుకు నిధులు కేటాయించి, ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి గీత కార్మికులకు కేటాయించడం ద్వారా వృత్తిని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో, దేశంలో పీడిత వర్గాలు, వృత్తిదారులు, కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని జాన్‌వెస్లీ అన్నారు. సర్దార్‌ సర్వాయి పాపన్న స్ఫూర్తితో గీత కార్మికులు హక్కుల సాధన కోసం జరిగే పోరాటాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం సీపీఐ(ఎం) తరఫున ఒత్తిడి పెంచుతామని హామీ ఇచ్చారు.

​రూ.4వేల పింఛన్‌ ఇవ్వాలి : ఎంవీ రమణ
గీత కార్మికులకు నెలకు రూ.4వేల పెన్షన్‌, రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు కావస్తున్నా ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు. 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు పెన్షన్‌ ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ కొత్తగా దరఖాస్తులు స్వీకరించడం లేదని తెలిపారు. కాటమయ్య రక్షణ కవచాన్ని అర్హులైన గీత కార్మికులందరికీ వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు. నందలంలోని నీరా ప్రాజెక్టుకు గత ప్రభుత్వం మిషనరీ, భవనాన్ని సమకూర్చినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ సంబంధిత మంత్రి కనీసం ప్రాజెక్టును సందర్శించలేదని విమర్శించారు. నీరా ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించి కల్లుగీత వృత్తిలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాలని, తద్వారా గీత కార్మికులతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. సభలో సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సుప్రజ హాస్పిటల్‌ ఎండీ శిగ విజరుకుమార్‌, హైకోర్టు న్యాయవాది నలుమాసు కష్ణ, జిల్లా అధ్యక్షుడు బూడిది గోపి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో బస్సు యాత్ర బృందం నాయకులు ఉషగొని వెంకట నరసయ్య, గైని వెంకన్న, చౌగోని సీతారాములు, గైని సాంబయ్య, సంఘం మాజీ కార్యదర్శి భీమగోని చంద్రయ్య, జనగామ మున్సిపల్‌ కౌన్సిలర్లు పాముకుంట్ల ప్రసాద్‌, గోపగోని సుగుణాకర్‌, బూడిది జ్యోతి, జిల్లా గౌరవాధ్యక్షులు కుర్ర ఉప్పలయ్య, ఆర్టీఏ మెంబర్‌ సిలువేరు అభిగౌడ్‌, సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌ సురుగు రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -