డిమాండ్‌ను సమతూకం చేస్తున్న బీజింగ్
న్యూఢిల్లీ : ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యం నుంచి తగ్గిన ముడి చమురు దిగుమతులను భర్తీ చేసి తద్వారా ఆసియాలో దాని డిమాండ్‌ను తగ్గించడానికి చైనా ఒంటరిగా ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనాకు గత నెలలో రోజుకు సగటున 8.41 మిలియన్ బ్యారల్స్ చమురు దిగుమతి అయింది. జూన్‌లో రోజుకు సగటున దిగుమతి అయిన 7.12 మిలియన్ బ్యారల్స్‌తో పోలిస్తే ఇది ఎక్కువే అయినప్పటికీ గత ఏడాది జూలైలో జరిగిన దిగుమతులతో పోలిస్తే 24.3 శాతం తక్కువే. అమెరికా, ఇజ్రాయిల్ సేనలు ఇరాన్‌పై ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించిన తర్వాత ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో హార్ముజ్ జలసంధిని టెహ్రాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో ముడి చమురు సరఫరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
ధరలను గమనిస్తూ దిగుమతులు
మధ్యప్రాచ్యం నుంచి ముడి చమురును ఎగుమతి చేస్తున్న సౌదీ అరేబియా, యూఏఈలు హార్ముజ్ జలసంధి వెలుపల ఉన్న ఓడరేవుల ద్వారా సరఫరాలు సాగించాయి. అయితే ఈ ప్రాంతం నుంచి ప్రస్తుతం రోజుకు ఐదు మిలియన్ బ్యారల్స్ ముడి చమురు కూడా రవాణా కావడం లేదు. మధ్యప్రాచ్యం నుంచి జరిగే చమురు ఎగుమతులలో సింహభాగం ఆసియాకే వెళుతుంది. హార్ముజ్ మూసివేతతో అక్కడికి ముడి చమురు రవాణా గణనీయంగా పడిపోయిం ది. గత నెలలో ఆసియా దేశాలన్నింటికీ కలిపి రోజుకు 22.82 మిలియన్ బ్యారల్స్ చమురు మాత్రమే వచ్చింది. గణాంకాలను పరిశీలిస్తే గత రెండు నెలల కాలంలో ఆసియా దిగుమతులకు జరిగిన నష్టం చైనా దిగుమతుల తగ్గుదలతో సమానంగా ఉంది. చైనా దిగుమతులు తగ్గడానికి ధరలలో అస్థిరత ఓ కారణం. ధరలు పెరిగినప్పుడు దిగుమతులను చైనా తగ్గించుకుంటుంది. అయితే ఇప్పుడు దిగుమతుల స్థాయి బాగా పడిపోవడం గమనార్హం.
పెరగనున్న దిగుమతులు
చైనా వద్ద ముడి చమురు నిల్వలు భారీగానే ఉన్నాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ నిల్వలు 1.2 బిలియన్ బ్యారల్స్ లేదా అంతకంటే ఎక్కువే ఉండవచ్చు. కాబట్టి దిగుమతులు తక్కువగానే ఉన్నప్పటికీ చైనా తట్టు కోగలుగుతోంది. ఆసియాలో ముడి చమురు మార్కెట్‌ను సమతుల్యం చేసే శక్తిగా చైనా ఈ విధంగా ఎంతకాలం కొనసాగుతుందన్నదే ఇప్పుడు మార్కెట్ ముందున్న ప్రశ్న. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన స్వల్పకాలిక కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా హార్ముజ్ జలసంధినుంచి బయలుదేరిన నౌకలు ఇప్పుడిప్పుడే గమ్యస్థానాలకు చేరుకుంటున్నందున ఈ నెలలో చైనా దిగుమతులు కొంతమేర పెరిగే అవకాశం ఉంది. ఈ నెలలో మధ్యప్రాచ్యం నుంచి చైనాకు రోజుకు 2.71 మిలియన్ బ్యారల్స్ ముడి చమురు దిగుమతి అవుతుందని అంచనా. ఏదేమైనా జూలైతో పోలిస్తే ఆగస్టులో దిగుమతులు గణనీయంగా పెరగవచ్చు. అయితే ప్రస్తుతం హార్ముజ్‌ను ఇరాన్ మూసివే యడంతో మధ్యప్రాచ్యం నుంచి ఇకపై సరఫరాలు పరిమితం గానే ఉంటాయి. ఒకవేళ ప్రయత్నాలు ఫలించి హార్ముజ్‌ను ఇప్పుడు తిరిగి తెరిచినా చమురు ట్యాంకర్లు చైనా ఓడరేవుల కు చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. విశ్లేషకుల అంచనా ప్రకారం ప్రస్తుత పరిస్థితులలో చైనా రిఫైనరీలు ముడి చమురు దిగుమతులను తగ్గించుకొని తమ వద్ద ఉన్న నిల్వలను వాడుకోవచ్చు. లేదా మధ్యప్రాచ్యానికి వెలుపల ఉన్న ఎగుమతిదారుల నుంచి ముడి చమురు కోసం బిడ్లు దాఖలు చేయవచ్చు.
ఆసియా చమురు మార్కెట్‌పై చైనా ఎఫెక్ట్
- Advertisement -
- Advertisement -



