మంత్రి తలసాని అధికార దుర్వినియోగం

– బల్కంపేట ఈవో నిర్లక్ష్యం
– దేవాదాయశాఖ కమిషనర్‌కు మర్రి శశిధర్‌ రెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవస్థానం కల్యాణోత్సవం మంగళవారం జరగనుందనీ, ఈ విషయంలో ఆ దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈవో) విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి ఆరోపించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ అధికార దుర్వి నియోగం చేస్తున్నా …. పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని విమర్శిం చారు. ఈ మేరకు సోమవారం శశిధర్‌ రెడ్డి దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌కు ఈమెయిల్‌ ద్వారా లేఖ పంపారు. ఆలయం చుట్టూ రోడ్లపై అనుమతి లేని షెడ్లు, మూడు వైపులా భారీ బోర్డులు, దానిపై ”శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం”, బల్కంపేట్‌, హైదరాబాద్‌, ”దాత – శ్రీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మంత్రి” అని రాసి ఉందని తెలిపారు. రాత్రి సమయంలో కనబడేందుకు వీలుగా లైట్లు ఉన్నాయని చెప్పారు. ఇటీవల 3.6 కిలోల బరువుతో తయారు చేసిన బంగారు కవచానికి తలసాని దాతనా? లేక గుడి చుట్టూ ఉన్న రోడ్లకు అడ్డంగా ఉన్న షెడ్లకా? లేక మొత్తం ఆలయానికా? అని తాను అక్కడి ఈవోను ప్రశ్నించినట్టు తెలిపారు. రోడ్లపై షెడ్ల మొత్తం ఖర్చు రూ.80 లక్షలు కాగా మంత్రి తలసాని రూ.5 లక్షలు ఇచ్చినట్టు చెప్పారని పేర్కొన్నారు. దాతల్లో ఒకరైన మంత్రి ఒక్కరికే బోర్డు పెట్టుకునేందుకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. 2022 ఫిబ్రవరి 4న షెడ్డు ప్రారంభోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో రూ.50 వేల నుంచి రూ.5.10 లక్షల వరకు విరాళాలిచ్చిన దాతల జాబితాలో మంత్రి పేరు లేదని గుర్తుచేశారు. అకస్మాత్తుగా మంత్రి కూడా విరాళం ఇచ్చారని పేర్కొనడం పట్ల శశిధర్‌ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తలసాని కేవలం రాజకీయ లబ్ది కోసమే ప్రజలను తప్పుదోవ పట్టి స్తున్నా…ఈవో మౌనంగా ఉంటున్నా రని ఫిర్యాదు చేశారు. వెంటనే బోర్డులకు విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేసి వాటిని తొలగించేలా ఈవోనూ ఆదేశించాలనీ, అవసరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love