– ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి
– ప్రాణ నష్టం జరగకుండా చూడటం ప్రథమ కర్తవ్యం : కేటీఆర్
– వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఐటీ పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా నానక్‌రామ్‌గూడలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో బుధవారం జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెండు మూడ్రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కావునా నగరపాలక సంస్థ ఇతర శాఖలన్నింటితో సమన్వయం చేసుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. ఇప్పటికే భారీ వర్షాలను సైతం ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకుని సంసిద్ధంగా ఉన్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. లోతట్టు ప్రాంతాలు, జలమయం అయ్యే ప్రధాన రహదారులు వంటి చోట్ల డివాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా నాలాలను బలోపేతం చేయడం వల్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పుతాయన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా అధికారులు వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వర్షాల వల్ల ప్రాణ నష్టం జరగకూడదన్న ఏకైక లక్ష్యంతో పని చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
పారిశుధ్య నిర్వహణపై చర్చ
హైదరాబాద్ నగర పారిశుధ్య నిర్వహణకు సంబంధించి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నగర పారిశుధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మంచి ఫలితాలను ఇస్తుందని, అయితే దీంతోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించడం, జనాభా పెరగడం వంటి అంశాల వల్ల చెత్త ఉత్పత్తి పెరుగుతున్నదని, ఈ మేరకు పారిశుధ్య నిర్వహణ ప్రణాళికలను సైతం ఎప్పటికప్పుడూ నిర్దేశించుకుంటూ ముందు కు పోవాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు తక్షణ, స్వల్పకాలిక పారిశుధ్య ప్రణాళికలను వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జోనల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.