జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో మనోళ్లే

హైదరాబాద్‌ జోన్‌కు చెందిన వావిలాల చిద్విలాస్‌ రెడ్డికి మొదటి స్థానం
 రెండో ర్యాంకూ మనదే
 టాప్‌-10లో ఆరుగురు తెలుగువారే..!
న్యూఢిల్లీ : అత్యంత ప్రతిష్టాత్మక ఐఐటీ ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌ జోన్‌కు చెందిన వావిలాల చిద్విలాస్‌ రెడ్డి (నాగర్‌కర్నూల్‌)కి ఈ ఫలితాల్లో మొదటి స్థానం లభించింది. అలాగే, టాప్‌-10 ర్యాంకుల్లో ఆరుగురు తెలుగు విద్యార్థులే ఉండటం గమనార్హం. మొత్తం 43 వేల మందికి పైగా విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక పరీక్షను క్లియర్‌ చేశారు. ఫలితాలతో పాటు తుది ఆన్సర్‌ కీని కూడా ఐఐటీ గువహతి విడుదల చేసింది. ఐఐటీ గువహతి విడుదల చేసిన ఫలితాల ప్రకారం.. ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్షలో చిద్విలాస్‌రెడ్డి 360 మార్కులకు గానూ 341 మార్కులు సాధించాడు. ఇదే హైదరాబాద్‌ జోన్‌కు చెందిన నాయకంటి భవ్య శ్రీ 298 మార్కులతో బాలికలలో మొదటి స్థానాన్ని పొందారు. ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్‌లో రెండు పేపర్లకు గానూ మొత్తం 1,80,372 మంది హాజరు కాగా.. వీరిలో 43,773 మంది అర్హత సాధించారు. వీరిలో బాలురు 36,204 మంది, బాలికలు 7,509 మంది బాలికలు పరీక్షను క్లియర్‌ చేశారు. ఈ నెల 4న ఈ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ (జేఓఎస్‌ఏఏ లేదా జోసా) కౌన్సిలింగ్‌ సోమవారం (19న) నుంచి ప్రారంభం కానున్నది. పరీక్షలో కటాఫ్‌ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మందిని ‘జోసా’ కౌన్సిలింగ్‌కు అర్హత కల్పిస్తారు.
టాప్‌-10లో ఆరుగురు హైదరాబాద్‌ జోన్‌ వారే..!
కాగా, టాప్‌ పది ర్యాంకుల్లో
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో మనోళ్లే ఆరుగురు ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ నుంచే ఉండటం గమనార్హం. హైదరాబాద్‌ జోన్‌కు చెందిన రమేశ్‌ సూర్య తేజ రెండో ర్యాంకును సాధించగా, రూర్కీ జోన్‌కు చెందిన రిషి కల్రా మూడో స్థానం పొందారు.
ఆ తర్వాతి ర్యాంకుల్లో రాఘవ్‌ గోయల్‌ (రూర్కీ), అడ్డగడ వెంకట శివరామ్‌ (హైదరాబాద్‌), ప్రభవ్‌ ఖండేల్వాల్‌ (ఢిల్లీ), బిక్కిన అభినవ్‌ చౌదరీ(హైదరాబాద్‌), మలేరు కెడియా (ఢిల్లీ), నాగిరెడ్డి బాలాజి రెడ్డి(హైదరాబాద్‌), యన్కంటి పాణి వెంకట మహేందర్‌ రెడ్డి (హైదరాబాద్‌) లు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు.
అర్హత సాధించినవారు హైదరాబాద్‌ జోన్‌ నుంచే అధికం
హైదరాబాద్‌ జోన్‌ నుంచే అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో అర్హతను సాధించారు. ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే జోన్‌లు ఉన్నాయి.
టాప్‌ 500 మంది అభ్యర్థులలో ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ నుంచి 174 మంది, ఐఐటీ ఢిల్లీ జోన్‌ నుంచి 120 మంది, ఐఐటీ బాంబే జోన్‌ నుంచి 103 మంది ఉన్నారు. మొత్తం 13 మంది విదేశీ విద్యార్థులు పరీక్షలో అర్హత సాధించారు. అలాగే 155 మంది ఓవర్సీస్‌ సిటిజెన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) అభ్యర్థులు పరీక్షను క్లియర్‌ చేశారు.

Spread the love