రాజేష్‌ అకాల మరణం వ్యవసాయ కార్మికోద్యమానికి తీరనిలోటు

ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి రాజేష్‌ మరణం వ్యవసాయ కార్మికోద్యమానికి, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరనిలోటని ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. రాజేష్‌ అకాల మరణానికి సంతాపం తెలుపుతూ బి వెంకట్‌ శనివారం ప్రకటన విడుదల చేశారు. రాజేష్‌ తన ఆరోగ్యం ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్లిందని తెలిసినా చలించలేదని, జీవితంపై నిరాశ చెందలేదని అన్నారు. తరచు తనతో మాట్లాడుతుండేవాడని, ఆరోగ్యం గురించి అడుగుతున్నా… ఉద్యమాల గురించి చెప్పేవాడని తెలిపారు. ఇటీవల ఆరోగ్యం కొంత కుదుట పడిందని, త్వరలో కోలుకుంటాడని ఆశిస్తున్న తరుణంలో ఇలాంటి విషాదకర వార్త వినాల్సి వచ్చిందని అన్నారు. అత్యంత చిన్న వయసులోనే తన పోరాట పటిమతో, అంకితభావంతో ఎదిగిన రాజేష్‌ అకాల మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు. తమ సంఘం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. నిరుపేదల కుటుంబంలో పుట్టిన రాజేష్‌, పేదల సమున్నత మార్పుల కోసం పరితపించాడని, అందుకు పోరాటాలే మార్గమని పోరు జెండా పట్టాడని అన్నారు. పేదల భూములు పెత్తందారులు అక్రమంగా కాజేసి ఆక్వాతో ఆ గ్రామాలను విషపూరితం చేస్తే ఆ ప్రమాదం నుండి పేదలను రక్షించుకునేందుకు అనేక పోరాటాలు సాగించారని తెలిపారు. రాజేష్‌కు విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Spread the love