రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది

– ప్రధానికి 9 మంది బీజేపీ ఎమ్మెల్యేల మెమోరాండం
– మణిపూర్‌ బీజేపీలో మరో అసమ్మతి సెగ
న్యూఢిల్లీ : బీరేన్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని పేర్కొంటూ మణిపూర్‌కు చెందిన 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పటికే వారు ప్రధానికి ఐదు అంశాలపై మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వంపై, పరిపాలనపై విశ్వాసం, నమ్మకం లేదని ఎమ్మెల్యేలు అందులో పేర్కొన్నారు.
ఈ మెమోరాండంపై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. వీరంతా మెయిటీ కమ్యూనిటీకి చెందినవారే కావటం గమనార్హం. కుకీ ఎమ్మెల్యేలు, మెయిటీ ఎమ్మెల్యేల మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని వీరు అభ్యర్థించారు. మణిపూర్‌లోని అన్ని ప్రాంతాలలో ఏకరీతిలో కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు.
అయితే, ప్రభుత్వ వైఫల్యమంటూ బీరేన్‌ సింగ్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇలా ప్రధానికి మెమోరాండం అందించటం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది మణిపూర్‌ బీజేపీలో అసమ్మతి సెగ మరొక ఎపిసోడ్‌గా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. బీరెన్‌సింగ్‌కు విధేయులుగా ఉన్న మెయిటీ వర్గానికి చెందిన 28 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌ను, నిర్మలా సీతారామన్‌లను కలిసిన రోజే(ఈనెల 19న).. ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రధానికి ఈ మెమోరాండంను సమర్పించారు.

Spread the love