కార్మిక, రైతు ఐక్యత బలోపేతం

కార్మిక సంఘాలు, ఎస్‌కేఎం ఉమ్మడి సమావేశం
న్యూఢిల్లీ : దేశంలో కార్మిక, రైతుల ఐక్యతను మరింత బలోపేతం చేయాలని కార్మిక, రైతు సంఘాలు పిలుపు ఇచ్చాయి. కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా సంయుక్త వేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశం కార్మికులు, రైతుల డిమాండ్‌లపై కార్యక్రమాలు, చర్యలకు పరస్పర సంఘీభావ మద్దతును కొనసాగించడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించడంతోపాటు ఆందోళనలకు మద్దతును కొనసాగించాలని పునరుద్ఘాటించింది. నోయిడాలో రైతులు, కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటాన్ని, వారణాసిలో, ఇతర ప్రాంతాలలో ప్రజాస్వామిక హక్కులపై ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చింది. కురుక్షేత్రలో తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీఛార్జ్‌ చేసి అరెస్టు చేయడాన్ని ఖండించింది. మహిళా మల్లయోధులకు న్యాయం జరిగేలా తమ మద్దతును పునరుద్ఘా టించింది. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది.
ఎన్‌డీఏ ప్రభుత్వ వినాశకరమైన విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతుల ఐక్యతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సమావేశం భావించింది. వచ్చే నెలలో మరోసారి సమావేశమై డిమాండ్‌లు, ఆందోళన కార్యక్రమాల ఉమ్మడి చార్టర్‌ను రూపొందించేందుకు కార్మికులు, రైతుల ఉమ్మడి జాతీయ సదస్సును ప్రణాళిక చేయాలని నిర్ణయించింది.

Spread the love