సంపద కొందరి చేతుల్లోనే

బీఆర్‌ఎస్‌ పాలనపై టీడీపీ ఉపాధ్యక్షులు : కాట్రగడ్డ ప్రసూన విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌
రాష్ట్రంలో సంపద కొందరి చేతుల్లోనే ఉందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ సంపదను వికేంద్రీకరించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ప్రగతిని ప్రగతి అందామా ? కేసీఆర్‌ కుటుంబానికి, కేసీఆర్‌ చుట్టూ ఉన్న తాబేదారుల కోసం నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాలు, అన్ని తరగతుల ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లను మూడు లక్షల మందికి ఇస్తామని చెప్పి, కేవలం 50 వేల మందికే పంపిణీ చేయడాన్ని తప్పుబట్టారు. సాగునీటిరంగంలో తమ ప్రభుత్వ గొప్ప ప్రగతిని సాధించిందని చెప్పుకుంటున్న బీఆర్‌ఎస్‌ సర్కారు, కాళేశ్వరంతోనే రాష్ట్రమంతా సస్యశ్యామలమైనట్టు చెప్పడాన్ని ఖండించారు. కేవలం 100 టీఎంసీలను మాత్రమే ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుద్వారా ఉపయోగించుకుందన్నారు. ఇందులో భాగంగా లక్ష్మీ బ్యారేజ్‌ీ, సరస్వతి బ్యారేజ్‌లు నీటిలో మునిగిపోయాయని గుర్తు చేశారు. అవి ఏ స్థితిలో ఉన్నాయో, కారణం ఏమిటో కూడా ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పలేదని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంపై పేటెంట్‌ రైట్స్‌ మాకే ఉన్నాయని అన్నట్టుగా బీఆర్‌ఎస్‌ సర్కారు తీరు ఉందని వ్యాఖ్యానించారు. దశాద్ది ఉత్సవాలు ఎన్నికల ప్రచారానికేనని విమర్శించారు. విలేకర్లతో అధికార ప్రతినిధి ఎఎస్‌ రావు, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ లీలాపద్మావతి పాల్గొన్నారు.
మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి : తెలుగు మహిళా అధ్యక్షురాలు బి.షకీలారెడ్డి
రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని తెలుగుదేశం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షులు బి. షకీలారెడ్డి విమర్శించారు. మానవ అక్రమ రవాణాలోనూ ఇదే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఎన్‌సీబీఆర్‌ నివేదికలు ఈవిషయాలను స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ప్రతియేటా 200కేసులు నమోదైతే, శిక్షలు మాత్రం కేవలం రెండు శాతం మందికే పడుతున్నాయని చెప్పారు. లైంగిక వేధింపులు సైతం పెరుగుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరు సంవత్సరాల అమ్మాయి నుంచి 60 ఏండ్ల వయస్సున్న మహిళల వరకు ఎవరికీ రక్షణ లేదని చెప్పారు. సీఎం ప్రగతిభవన్‌ నుంచి బయటకు వస్తే మహిళలపై అఘాయిత్యాలు కనిపిస్తాయని అన్నారు. విలేకర్ల సమావేశంలో అధికార ప్రతినిధి సూర్యదేవర లత పాల్గొన్నారు.

Spread the love