కన్నీటి వీడ్కోలు

– ముగిసిన జెడ్పీ చైర్మెన్‌ కుసుమ జగదీష్‌ అంత్యక్రియలు
– మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మెన్ల ఘన నివాళి
నవతెలంగాణ-ములుగు
బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మెన్‌ కుసుమ జగదీశ్వర్‌(47) మృతదేహానికి సోమవారం ఆయన స్వగ్రామం ములుగు జిల్లా మల్లంపల్లిలో అంత్యక్రియలు ముగిశాయి. జగదీష్‌ మృతదేహాన్ని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సందర్శించి గులాబీ జెండాకప్పి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉద్యమకాలంలో తనవెంట నడిచిన సహచరులు ఇక మీదట లేరని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజరు, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, మాలోత్‌ కవిత, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినరు భాస్కర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీతక్క, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, అరూరి రమేశ్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్‌ నాయక్‌, రేగ కాంతారావు, గాదరి కిశోర్‌ కుమార్‌, కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎల్‌ రమణ, కడియం శ్రీహరి, బీఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకర్‌, పలువురు జడ్పీ చైర్మెన్లు, కార్పొరేషన్‌ చైర్మెన్లు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి నివాళులర్పించారు. కుసుమ మృతదేహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, బీజేపీ జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్‌ రెడ్డి, ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా నివాళి అర్పించారు. మంత్రులు సత్యవతి రాథోడ్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కర్నె ప్రభాకర్‌, ఏరువా సతీష్‌ రెడ్డి తదితరులు జగదీశ్వర్‌ అంతిమయాత్రలో పాడే మోశారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లా డారు. నాడు ఉద్యమంలో కేసీఆర్‌ ఏ పిలుపునిచ్చినా ఉద్యమకారుడిగా ప్రాణాలకు సైతం తెగించి పోరా డిన నాయకుడు కుసుమ జగదీష్‌ అని కొనియా డారు. నాలుగైదు రోజుల కిందట ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జెడ్పీ చైర్మెన్‌గా, జిల్లా పార్టీ అధ్యక్షు డిగా పాల్గొన్నారని చెప్పారు. రెండు దశాబ్దాల నుంచి కేసీఆర్‌కు తమ్ముడిలా.. సుశిక్షతుడైన సైనికుడిలా పనిచేసిన ఆత్మీయ మిత్రుడు, కుసుమ జగదీశ్‌ అకాల మరణం అందరినీ తీవ్ర ఆవేదనకు గురిచేసిం దన్నారు. వార్త తెలియగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని తెలిపారు.
ఆయన ఉద్యమంలో పేరు సంపాదించు కున్నాడు.. రాజకీయాల్లో పేరు సంపాదించుకు న్నారని.. కానీ, ఆస్తిపాస్తులు కూడబెట్టుకోలేదని అన్నారు. జగదీష్‌ కుటుంబానికి చివరి దాకా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Spread the love