కొడిగడుతున్న కార్పొరేషన్లు..

దరఖాస్తులన్నీ పెండింగ్‌లోనే..
బీసీ, ఎంబీసీలకు చెందిన లక్షల దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. బీసీల స్వయం ఉపాధికి సంబంధించి బీసీ కార్పొరేషన్‌తో పాటు 11 ఫెడరేషన్లు ఉన్నాయి. ఇవి సహకార సమాఖ్యల పరిధిలో ఉన్నాయి. 2017-18కి సంబంధించి 5.70లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి బీసీలకు రెండు సార్లు మాత్రమే లోన్లు వచ్చాయి. 2015లో ఒకసారి, 2018లో ఎన్నికలకు ముందు మరోసారి ఇచ్చారు. 2018లో దరఖాస్తు చేసుకున్నవారిలో లక్ష లోపు లోన్లు అవసరం ఉన్న 50 వేల మంది వరకు రుణాలు ఇచ్చారు. ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోగానే దరఖాస్తులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. ప్రస్తుతం 5.20 లక్షల దరఖాస్తులన్నీ పెండింగ్‌లోనే మూలుగుతున్నాయి. మైనార్టీ కార్పొరేషన్‌ పరిధిలో 2018-19లో 23,829 దరఖాస్తులు తీసుకున్నారు. వాటిని పరిష్కారం చేయలేదు. కొత్త దరఖాస్తులు స్వీకరించటం లేదు.
నిధుల్లేక వెలవెల
– సబ్సిడీ లోన్లకోసం యువత నీరీక్షణ
– పెండింగ్‌లో లక్షల దరఖాస్తులు
– స్వయం ఉపాధికి రుణాలు ఉత్తమాటేనా?
– కేటాయింపుల తగ్గింపుపై పలు అనుమానాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో యువత స్వయం ఉపాధికి ఆసరాగా ఉండాల్సిన బలహీన వర్గాల, వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లు కొడిగట్టుకు పోతున్నాయి. నిధుల్లేక వెలవెల బోతున్నాయి. సంక్షేమ కార్పొరేషన్లకు దరఖాస్తు చేసుకుని ఏండ్లు గడుస్తున్నా.. మోక్షం లభించటం లేదు. రాయితీ రుణాలు మంజూరు కోసం లక్షల మంది దరఖాస్తుదారులు నిరీక్షిస్తున్నారు. స్వయం ఉపాధి పొందాలనుకున్న నిరుద్యోగుల ఆశలు నెరవేరకపోవడంతో వారు ఆవేదనకు గురవుతున్నారు.
ఎన్నికల ఏడాది కావడంతో ఈ సంవత్సరమైనా సబ్సిడీ రుణాలు అందక పోతాయా అని ఎదురు చూసే యువత ఆశలు నెరవేరుతాయా? అంటే..కష్టమేనని కార్పొ రషన్లలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు పెదవి విరుస్తు న్నారు. గత నాలుగేండ్ల నుంచి యువతకు లోన్లు రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్ల పరిధిలో సుమారు 9 లక్షల వివిధ కేటగిరీల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి హడావుడిగా దరఖాస్తులు స్వీకరించిన సర్కారు.. తర్వాత వాటిని పక్కనపడేసింది.
నిధులు లేమితో వెలవెల..
నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి వైపు మళ్లించి ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీ సహకార ఆర్థిక సంస్థలు (కోఆపరేటీవ్‌ కార్పొరేషన్లు) నిధులు లేక బలహీనపడుతున్నాయి. ఏటేటా వీటికి బడ్జెట్‌ కేటాయింపులను తగ్గిస్తున్న ప్రభుత్వం.. కనీసం కేటాయించిన మేరకు కూడా నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఆయా కార్పొరేషన్ల లక్ష్యం గాడి తప్పుతోంది. నిధుల లేమితో రుణాల కార్యాచరణ సిద్ధం చేయటం లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు.దీంతో కుట్టు మిషన్లు, జిరాక్స్‌ మిషన్లు, కిరాణ దుకాణం, ఆటో రిక్షా వంటి వాటితో స్వయం ఉపాధి పొందాలనుకున్న నిరుద్యోగుల ఆశలు నెరవేరడం లేదు.
చివరకు తోపుడు బండి వ్యాపారానికి రూ.50వేల కోసం దరఖాస్తు చేసుకున్న వారు వేలల్లో ఉన్నారంటే..అతిశయోక్తికాదు.బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల పరిధిలో నాలుగేండ్ల కింద చేసుకున్న దరఖాస్తులు మనుగుడలో ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి ఉందని బీసీ, ఎంబీసీ సంఘాల నేతలు వాపోతున్నారు.
సంక్షేమ శాఖల వారిగా ఇదీ..పరిస్థితి..
దళిత బంధు పథకం, బీసీ కుల వృత్తులకు ఆర్థిక చేయూత అందిస్తున్నామన్న సాకుతో ఆయా తరగతులకు చెందిన కార్పొరేషన్లను నిర్వీర్యం చేస్తే ఎలా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దళిత బంధు పథకం వచ్చాక..ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల మంజూరులో కదిలిక లేదు. వీటి కోసం ఏటా రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుం టున్నారని అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. 2017-18లో ఎంపికైన దరఖాస్తు దారులకు మంజూరైన రుణాలు రూ.80కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తున్నది. 2018-20 వరకు తిరిగి కార్యాచరణ అమలు చేయలేదు. 2020-21లో1.73లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే..18,285 మందికి మాత్రమే రుణాలివ్వాలని ఎస్సీ కార్పొరేషన్‌ నిర్ణయించింది. వాటికి కూడా లబ్దిదారుల ఎంపిక నిలిచిపోవటం గమనార్హం. 2018 ఎన్నికల తర్వాత కార్పొరేషన్‌ లోన్లు మొత్తానికే రావడం లేదు.
ఎస్టీలదీ అదే పరిస్థితి..
గిరిజన సహకార సంస్థ(ట్రైకార్‌) పరిధిలో 2017-18 ఏడాదికి సంబంధించిన పెండింగ్‌ రుణాలు ఇటీవలనే కొన్ని విడుదల చేశారు. ఆ తర్వాత వరసగా రెండేండ్లకు ప్రణాళిక రూపొందించలేదు. 2020-21,2021-22లో స్వయం ఉపాధికోసం రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 27వేల మందికి మాత్రమే ఉపాధి పథకాలు మంజూరయ్యాయి.
వీటికి రూ.280కోట్లు అవసరమని గిరిజన కార్పొరేషన్‌ అంచనా వేసినా..నిధులు విడుదల కాలేదు. కాగా 2018-2019 ఆర్థిక సంవత్సరం అప్లికేషన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పటి దాకా ఒక్కరికీ కూడా లోను ఇవ్వలేదు.

Spread the love