నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్‌టీపీపీ)లో చేపట్టిన పర్యావరణహిత చర్యలకు రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారంనాడిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈ అవార్డును సింగరేణి యాజమాన్యానికి అందచేశారు. ఎస్‌టీపీపీలో చేపట్టిన కాలుష్య నివారణ, నీటి, ఇంధన పొదుపు చర్యలు, వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపునకు చేస్తున్న కషిని గుర్తిస్తూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. మంత్రుల చేతులమీదుగా ఎస్‌టీపీపీ చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథ రాజు ఈ అవార్డును అందుకున్నారు. ప్లాస్టిక్ రహిత, పర్యావరణహిత వస్తువుల ప్రదర్శనను మంత్రులు సందర్శించారు. పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకుంటున్న వివిధ శాఖల అధికారులు, సంస్థలు, విద్యార్థులకు ప్రోత్సహకాలు, బహుమతులు అందజేశారు.
సింగరేణి కార్మికులకు గొప్ప ఫలితాలు : ఎమ్మెల్సీ కే కవిత
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు వ్యతిరేకంగా అనేక మంది ప్రయత్నాలు చేసినా, సీఎం కేసీఆర్ పట్టుబట్టి వారసత్వ ఉద్యోగాలు అందిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న బొగ్గు గని కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. సంస్థలో ఇప్పటివరకు దాదాపు 15 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు. పురుషులకే కాకుండా, కూతుళ్ల్లు, కోడళ్లకు సైతం అవకాశం ఇవ్వడం ద్వారా మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి నిరూపితమైందన్నారు. ఈ సందర్భంగా సంస్థలో అమలవుతున్న పలు కార్మిక సంక్షేమ కార్యక్రమాలను ఆమె ప్రస్తావించారు.