పరిశ్రమల రంగంలో తెలంగాణ నెంబర్‌ వన్‌

– 47 బిలియన్‌ కోట్ల పెట్టుబడులు… 30 లక్షల ఉద్యోగాలు
– ట్రేడ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌గా భిక్షపతి బాధ్యతల స్వీకరణ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక విధానాల వల్ల గత తొమ్మిదేండ్ల కాలంలో రాష్ట్రానికి 47 బిలియన్‌ కోట్ల పెట్టుబడులు వచ్చాయనీ, దానితో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌గా నియమితులైన మఠం భిక్షపతి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కవిత గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి భిక్షపతి నిదర్శనమని తెలిపారు. గ్రామ స్థాయిలో కార్యకర్తగా పనిచేసిన ఆయన్ను గుర్తించి సీఎం కేసీఆర్‌ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ పదవి ఇవ్వడం సామాన్యమైన విషయం కాదని స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో ఆంథోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను పెద్ద మెజారిటీతో గెలిపించడానికి బిక్షపతి చేయుత, పదవి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమల రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానానికి ఎదిగిందని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రయివేటు రంగంలో కూడా లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తున్నదని వివరించారు. పరిశ్రమల శాఖలోని ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ కూడా ముఖ్యమైనదని స్పష్టం చేశారు. ఉత్పత్తులను ఎగుమతులు చేసుకోడానికి పారిశ్రామికవేత్తలకు ఈ కార్పొరేషన్‌ వెన్నుదన్నుగా పనిచేస్తుందని చెప్పారు. కరోనా కన్నా ముందు రూ. 30 కోట్ల ఆదాయం ఉన్న కార్పొరేషన్‌ ప్రస్తుతం రూ. 130 కోట్ల లాభాల్లో ఉందని చెప్పారు. ఈ మొత్తం రూ. 1500 కోట్లకు చేరుకుంటుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

Spread the love