రైతు బంధును పూర్తిస్థాయిలో ఎప్పుడిస్తారు?

– సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అయిందనీ, రైౖతు బంధును పూర్తిస్థాయిలో ఎప్పుడిసారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఈమేరకు గురువారం సీఎంకు ఆయన లేఖ రాశారు. ‘మాటలు కోటలు దాటుతాయి. పనులు గేటు కూడా దాటవు. అనే రీతిలో రైతు బంధు జమ చేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. రైతు బంధు మాత్రం పూర్తి స్థాయిలో అందటంలేదని పేర్కొన్నారు. ఇంకా లక్షల మంది అన్నదాతలు ఆ నగదు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు ఎప్పుడు పడతాయి? మెసేజ్‌ వచ్చి సెల్‌ఫోన్‌ ఎప్పుడు మోగుతుందా? అని వారు ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హౌల్డ్‌లో పెట్టిన అకౌంట్స్‌ను తిరిగి ప్రారంభించి రైతులకు నగదు అందేలా చూడాలని కోరారు. మిగిలిన రైతులకు కూడా రైతు బంధు వెంటనే జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే, రైతులతో కలిసి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

111 జీవోపై కాంగ్రెస్‌ పోరాట కమిటీ కన్వీనర్‌ సంగిశెట్టి జగదీష్‌, సభ్యులుగా లుభ్నా, లిఖిత
రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన జీవో 111పై క్షేత్రస్థాయి పరిశీలన చేసేందుకు కాంగ్రెస్‌ పోరాట కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్‌గా సంగిశెట్టి జగదీష్‌, సభ్యులుగా లుభ్నా, లిఖితను నియమించారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు కోదండరెడ్డి ప్రకటించారు.జీవో 111పై అన్ని వర్గాల ప్రజలను కలిసి పూర్తి సమాచారం సేకరించాలని సూచించారు. జంట జలాశయాల పరిరక్షణ, చెరువుల రక్షణ, అక్కడి రైతుల ప్రయోజనాలను కాపాడేలా నివేదిక రూపొందించనున్నట్టు తెలిపారు. 111 జీవో పరిధిలో 84 గ్రామాలు ఉన్నాయనీ, ఆ జీవో ఎత్తేసేటప్పుడు ప్రభుత్వం అక్కడి గ్రామాల రైతులను పట్టించుకోలేదని కోదండరెడ్డి విమర్శించారు. 111 జీవో పరిధిలో మెజార్టీ భూమి బీఆర్‌ఎస్‌ నేతల కబ్జాలో ఉందని ఆరోపించారు.
త్వరలో బీసీ గర్జన కర్నాటక సీఎం సిద్ద్దరామయ్య హాజరు వీహెచ్‌
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో త్వరలో ‘బీసీ గర్జన’ నిర్వహించనున్నట్టు మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్పారు. ఈ సభకు కర్నాటక సీఎం సిద్దరామయ్య హాజరు కానున్నట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీయే బీసీలకు న్యాయం చేసిందన్నారు.
బీసీ జనగణన చేసే దమ్ముందా? : రియాజ్‌
రాష్ట్రంలో బీసీ జనగణన చేపట్టే దమ్ము బీఆర్‌ఎస్‌ సర్కారు ఉందా? అని టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్‌ ప్రశ్నించారు. బీసీ మంత్రులుగా చెప్పుకునే వారు కాంగ్రెస్‌ సామజిక న్యాయం గురించి మాట్లాడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నాలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే మూడు చోట్ల బీసీ వర్గాలకు చెందిన వారే సీఎంలుగా ఉన్నాయని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి కనీసం బీసీని అధ్యక్షుడిని చేసే ధైర్యముందా? అని ప్రశ్నించారు.
కేసీఆర్‌ స్పందించాలి :దయాకర్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీసీల గురించి స్పందించి…మాట్లాడాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు బీసీకు ఎన్ని నిధులు ఖర్చుపెట్టారో మంత్రి తలసాని చెప్పగలరా? అని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి చేసిన అవినితి అరోపణలు నిరూపించుకోలేక బీఆర్‌ఎస్‌ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీజేపీ చేతగానితనానికి మణిపూర్‌ నిదర్శనం ఏఐసీసీ ఆదివాసీ సెల్‌ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతగానితనానికి మణిపూర్‌ ఘటనలే నిదర్శమని ఏఐసీసీ ఆదివాసీ సెల్‌ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్‌ విమర్శించారు. 85 రోజులుగా మణిపూర్‌ మండుతోందన్నారు. చాలామంది గిరిజనులు మణిపూర్‌ను వదిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆ రాష్ట్రంలో రెండు తెగల మధ్య బీజేపీ చిచ్చు పెట్టిందని విమర్శించారు. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఆ పార్టీ ఆదేశంమేరకు ఆందోళనలో పాల్గొంటున్నారని విమర్శించారు.
డబుల్‌బెడ్‌ రూమ్‌ల కోసం మంత్రి కిషన్‌రెడ్డి డ్రామా ఎమ్మెల్యే సీతక్క
బీఆర్‌ఎస్‌, బీజేపీల ఒప్పందలో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డబుల్‌బెడ్‌ రూం ఇండ్లను చూసేందుకు వెళ్లారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఎద్దేవా చేశారు. ఆయన్ను అరెస్టుచేయాల్సిన అవసరం లేదని చెప్పారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల సమస్య ఎప్పటి నుంచో ఉందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సీతక్క విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి తెలంగాణలో తిరిగే ముందు కేంద్ర మంత్రి హోదాలో ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాలని సూచించారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో అక్కడికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారని నిలదీశారు. గుజరాత్‌లో మోడీ సీఎంగా ఉన్నప్పుడే గోద్రా ఘటనలో వేలాది మంది మహిళలు చనిపోయారని తెలిపారు. బీజేపీ సర్కార్‌ రాజకీయం కోసమే తప్ప ప్రజల కోసం పని చేయడం లేదని విమర్శించారు. ప్రధాని మోడీ, అమిత్‌షా, కిషన్‌రెడ్డి మణిపూర్‌ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాజీనామా చేయాలని కోరారు
. దేశ అస్థిరకు మోడీ విద్వేష రాజకీయాలే కారణం
టీపీసీసీ ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్‌
దేశంలోని నెలకొన్న అస్థిర పరిస్థితులకు మోడీ విద్వేష రాజకీయాలే కారణమని టీపీసీసీ ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్‌ విమర్శించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పాలక ఎన్డీఏను ఓడించేందుకు కాంగ్రెస్‌ పెద్దన్న పాత్రను పోషిస్తూ 26 ప్రతిపక్ష పార్టీల కూటమిని ఏర్పాటు చేసిందని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ రెచ్చగొట్టుడు రాజకీయాలతో మణిపూర్‌లో విద్వేష మంటలు చెలరేగుతున్నాయని విమర్శించారు. భారత ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం, ఫెడరల్‌ స్ఫూర్తిని నింపేందుకు ‘ఇండియా’ కూటమిని బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ భావిస్తున్నదని తెలిపారు.

Spread the love