మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ- బేటీ’ బంధం

– రాష్ట్రం మీదుగా దేశమంతా విస్తరిస్తాం:బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షులు కేసీఆర్‌
– గులాబీ పార్టీలోచేరిన పలువురు మహారాష్ట్ర నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ-బేటీ’ బంధమని బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.. వెయ్యి కిలోమీటర్ల మేర సరి హద్దును పంచుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచి సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్యత ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నా మని హామీ ఇచ్చారు. ఇంతటి అనుబంధమున్న మహారాష్ట్ర నుంచే దేశ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ను విస్తరిస్తామని తెలిపారు. కేవలం తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందనీ, అదే స్ఫూర్తితో మహారాష్ట్రను ప్రగతిపథంలో నడిపించుకుందామని వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రంలో పార్టీల మధ్య జంప్‌ జిలానీలను ప్రజలు గమనిస్తున్నారంటూ అక్కడి రాజకీయ పార్టీలను ఆయన హెచ్చరించారు. భగత్‌సింగ్‌, అల్లూరి సీతారామరాజు లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ప్రజలను చైతన్యవంతులను చేయాలని యువతకు పిలుపునిచ్చారు. శని వారం షోలాపూర్‌, నాగపూర్‌ తదితర ప్రాంతాల నుంచి పలువురు నేతలు, ప్రముఖులు తెలంగాణ భవన్‌లో అధినేత, సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”దేశంలో అవసరానికి మించి నదీ జలాలు, సహజ సంపదలు ఉన్నాయి. 75 ఏండ్లు గడిచినా ఈ దేశాన్ని పాలించిన పాలకులు వాటిని వినియోగంలోకి తేలేకపోతున్నారు. ప్రపంచంలో మొన్నటి వరకు చైనా వెనుకబడి ఉంది. ప్రస్తుతం ఆ దేశం మనం అందుకోలేనంత అభివృద్ధి చెందింది. దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలను కేంద్ర పాలకులు సరైన రీతిలో చేయకపోవడమే అందుకు కారణం. సభ్య దేశాల ముంగిట అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశ పరువును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది….. ”అని ఆయన తెలిపారు. అభివృద్ధి నిరోధ కులకు ఓట్లు వేసుకుంటూ, గెలిపించుకుంటూ, కనీసం తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ వంటి కనీస సౌకర్యాలు లేకుండా ఇంకెన్నాళ్లు అభివృద్ధి దూరంగా ఉందామని ప్రశ్నించారు. ఇతర దేశాలు అభివృద్ధి చెందుతుంటే మన దేశం ఎందుకు వెనుకబడి ఉందనే విషయంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలనీ, ఇతరులతో చర్చించాలని సూచించారు. ప్రపంచం లోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగానికి సబ్సిడీ ఇస్తుంటే, వ్యవసాయాధారిత భారత దేశంలోని పాలకులు అందుకు వ్యతిరేకంగా వ్యవహరించడం కేసీఆర్‌ విమర్శించారు.
బీఆర్‌ఎస్‌ రూపంలో ఇంటి గడప ముందుకు అభివృద్ధి వచ్చిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు సహా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకురావాలని వారిని ఆహ్వానించారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. వారి జీవితాలను తీర్చిదిద్దుతానని భరోసానిచ్చారు. దాదాపు 300 మందికి పైగా నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

Spread the love