మహారాష్ట్రలో ఏం ఒరగబెడతారు?

– కత్తి వెంకటస్వామి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణలో ఏమి చేయని సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర ప్రజలకు ఏం ఒరగబెడతారని టీపీసీసీ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి విమర్శించారు. తెలంగాణ మోడల్‌ అంటే ఎవరికి అర్థం కావడం లేదని తెలిపారు. మోడల్‌ అంటే పేపర్‌ లీకేజీ, రైతు రుణమాఫీ చేయకపోవడం, ఫీజు రీఎంబర్స్‌ మెంట్‌ ఇవ్వకపోవడమా? అని ప్రశ్నించారు. తెలంగాణ మోడల్‌ పై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు.
కేసీఆర్‌ దేశానికి ఆదర్శమెలా అవుతారు?:గౌరీ సతీష్‌
కేజీ టు పీజీ ఉచిత విద్య, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీలిచ్చి మాట తప్పిన సీఎం కేసీఆర్‌ దేశానికి ఆదర్శమెలా అవుతారని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్‌ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసిన కేసీఆర్‌ దేశానికి ఇదే గతి పట్టించాలనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని రాష్ట్ర ప్రజలకు సూచించారు.
ముఖం చెల్లకే….
రాష్ట్రంలో ముఖం చెల్లకే సీఎం కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్థన్‌ రెడ్డి విమర్శించారు. పీఆర్సీ గడువు ఈ నెలతో ముగిసినా కొత్త కమిటీ వేయడం లేదనీ, ఐఆర్‌ ప్రకటించలేదని తెలిపారు.
మహారాష్ట్రకు ఎందుకు?
రాష్ట్రంలో అనేక సమస్యలుండగా, వాటిని పరిష్కరించకుండా సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రకు ఎందుకు వెళుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి వెదిరె యోగేశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలనలో నిజమైన రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కౌలు రైతులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

Spread the love