– రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి : భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మంత్రి కేటీఆర్ సభ్యత, సంస్కారం మర్చిపోయి సంస్కార హీనుడిగా మారి…. రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రిగా అయ్యే అవకాశమున్నా ఆ పదవులను త్యాగం చేసిన గొప్ప మనిషి రాహుల్ గాంధీ అని తెలిపారు. దేశం సమైక్యంగా ఉండాలనీ, జాతి విచ్ఛిన్నం కాకూడదనీ, భారత్ జోడో యాత్రతో దేశ రాజకీయాలను ప్రభావితం చేశారని కొనియాడారు. ఆ యాత్రలో ప్రజల బాధలను నేరుగా తెలుసుకున్నారని గుర్తుచేశారు. వరినాట్లు వేసే పొలాలు కేటీఆర్‌కు పబ్బులాగా కనిపిస్తున్నాయంటే ఆయన మానసిక స్థితి అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.
పేదలు, రైతులు, కార్మికులు బాగుపడాలని తపిస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పారు. అవినీతిలో కూరుకుపోయి ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో సెటిల్‌మెంట్ చేసుకున్న నాయకుడు కాదంటూ పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
దేశానికి హరిత, శ్వేత, కంప్యూటర్ విప్లవాలను తీసుకొచ్చిన కుటుంబానికి చెందిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ అని భట్టి తెలిపారు.