– లేకుంటే ముక్కు నేలకు రారు
– ఎంపీ అరవింద్‌కు ఎమ్మెల్సీ కవిత సవాల్
నవతెలంగాణ-నిజామాబాద్
తనపై అర్థంపర్థం లేని అరోపణలు చేయడం కాదని, వాటిని రుజువు చేయాలని.. లేకుంటే పులాంగ్ చౌరస్తా వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. 24 గంటల్లోగా తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం విలేకరులతో ఆమె చిట్‌చాట్ నిర్వహించారు. ఎంపీ అరవింద్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తన నాన్నను, అన్నను అన్నా వదిలేశామని, అసలు రాజకీయాలతో సంబంధం లేని తనభర్త పేరును ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. చౌకబారు రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. అరవింద్ ఎక్కడపోటీ చేసినా అక్కడికి వెళ్లి ఆయన్ని ఓడించి తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని స్పష్టం చేశారు. మణిపూర్ అల్లర్లపై, నిరుద్యోగంపై బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అన్ని విషయాలపై నిలదీస్తామన్నారు. కేంద్రం నుంచి అరవింద్ ఏం తెచ్చారని నిలదీశారు. అబద్ధాల మీద సమాజం నడవదని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్లి తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడమే బీజేపీ ఎజెండా అని ధ్వజమెత్తారు. రైతులు బీఆర్‌ఎస్ పార్టీకి దగ్గరయ్యారనే కాంగ్రెస్ నాయకులు అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు.. వ్యాపారవేత్తలకు కూడా మూడు గంటలే సరిపోతుందని చెప్పగలరా అని ప్రశ్నించారు. పైసలు ఉన్న వారి పక్షాన బీజేపీ, కాంగ్రెస్ నిలబడతాయని అన్నారు. సోనియా గాంధీ దయ్యమని, పావురాల గుట్టలో పావురంలా వైస్‌ఆర్ మాయమైపోయిండని విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టే ఉచిత కరెంట్ ఇచ్చిందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.