వర్షాలతో స్తంభించిన జనజీవనం

– పాజెక్టుల్లోకి వరద నీటితో గేట్లు ఎత్తివేత
– మత్తడి పోస్తున్న చెరువులు, కుంటలు
– నీట మునుగుతున్న పంట పొలాలు
– కేంద్రాలకు ముంపు ప్రాంత ప్రజలు
– అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
నవతెలంగాణ-విలేకరులు
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. రహదారులపై వరద నీరు చేరి వాహన, పాదచారులకు ఇబ్బందికరంగా మారాయి. పంట పొలాల్లోకి కూడా వర్షపు నీరు భారీగా వచ్చి చేరడంతో పంట నీట మునిగే పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్లు కూలుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగళూర్‌ గేట్‌ నుంచి మై హౌమ్స్‌ వెళ్ళే దారిలో ఉన్న వాగు నిండి రోడ్డుపైకి నీరు వస్తోంది. కడ్తాల్‌ మండలంలోని టాకురాజుగూడ గ్రామంలో వర్షం ధాటికి ఓ ఆవు, దూడ మృత్యువాతపడ్డాయి. వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ మండలం మైలారం మొండికుంట చెరువు అలుగు పారడంతో కొత్త తండా చింతకుంట గ్రామానికి పోయే రోడ్డు మార్గంలో అంపల్లికి చెందిన డ్రైవర్‌ వరదలో చిక్కుకున్నాడు. స్థానికులు అప్రమత్తమై మరో ట్రాక్టర్‌ సహకారంతో డ్రైవర్‌ని కాపాడారు. నవాబుపేట మండలం చించల్‌పేట్‌ గ్రామంలో మూసినదిపై నిర్మించిన వంతెన (బ్రిడ్జి) వద్ద వరద ఉధృతిని కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం సమీపంలోని బీమలింగం మూసీ నది వంతెనపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి ప్రయాణికులను దారి మళ్లిస్తున్నారు. భూదాన్‌పోచంపల్లిలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆలేరు మండలకేంద్రంలో ఈదుల వాగు, రత్నాల వాగు పొంగిపొర్లుతున్నాయి. చౌటుప్పల్‌ మున్సిపల్‌ పరిధిలోని లింగారెడ్డిగూడెంలో కౌలు రైతు యాట ముత్యాలు వ్యవసాయ బావి వద్ద విద్యుద్ఘాతానికి గురై మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మోదీన్‌పురం ఆవాసం పాండ్యానాయక్‌తండాలో ధరావత్‌ మధు(23) తన పొలం గట్ల మీద నడుస్తుండగా అప్పటికే తెగిపడి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ వైరు తగలడంతో విద్యుద్ఘాతమైంది. సూర్యాపేట ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మృతి చెందాడు.
ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని మంజీర నదిలోనికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఘనపూర్‌ ఆనకట్ట పొంగిపొర్లుతోంది. సంగారెడ్డి జిల్లా పరిధిలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని మెదక్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రాజార్శిషా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్‌ సూచించారు. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం షెరిగుడా గ్రామంలో గొల్ల మల్లేశ్‌ ఇంటి కప్పు కూలిపోయింది. కృష్ణ మండలం అయినాపూర్‌ గ్రామానికి వెళ్లే దారిలో రైల్వే వంతెన కిందకు భారీగా నీరు చేరింది. మహబూబాబాద్‌ జిల్లా బయ్యార మండలంలోని మొట్ల తిమ్మాపురంలోని వట్టే వాగు ఉధృతంగా ప్రవహించడంతో రెండు రోజులుగా గ్రామం జలదిగ్బంధంలో ఉంది. కాచినపల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరి గోగ్గల పాపారావు(60) మూర్ఛ వ్యాధి వచ్చి వాగులో పడిపోయి మృతిచెందారు. జనగామ జిల్లా జఫర్గఢ్‌ మండల కేంద్రానికి చెందిన గొర్ల కాపరి ముడికే కొమురయ్యకు చెందిన గొర్రెలు, మేక విద్యుద్ఘాతంతో మృత్యువాతపడ్డాయి. తరిగొప్పుల మండలం అక్కరాజు పల్లి గ్రామంలో తాటి పోచయ్య ఇల్లు కుప్పకూలింది. ములుగు జిల్లా మంగపేట తహసీల్దార్‌ కార్యాలయంలోకి వర్షం నీరు వచ్చి చేరింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువు నీటిమట్టం 25 అడుగులు దాటిందని నీటిపారుదల శాఖ ఏఈ హర్షద్‌ తెలిపారు. వరంగల్‌ జిల్లా పాకాల సరస్సు నీటిమట్టం 19 అడుగులకు చేరుకోగా, మాదన్నపేట పెద్ద చెరువు 17 అడుగులకు గాను 16 అడుగుల నీరు చేరుకొంది. మరో రెండ్రోజుల్లో మత్తడి పడే అవకాశాలు ఉన్నాయి. గురిజాల పెద్దం చెరువు లోలెవల్‌ కాజ్‌ వే వరద ప్రవాహం తీవ్రంగా ఉండగా రాకపోకలు స్తంభించాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని మినీ బొగత జలపాతం పరవళ్ళు తొక్కుతోంది.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగా తదితర నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పంటలన్నీ నీట మునిగాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాలలో గోదావరి నీటి మట్టం పెరగడంతో సమీపంలో నిర్మించిన మాతాశిశుసంరక్షణ కేంద్రాన్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. బోథ్‌ మండలం ధన్నూర్‌(బి) గ్రామంలో జుపాక రాజేశ్వర్‌ ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఇంద్రవెల్లి మండలం గిన్నెర పంచాయతీ పరిధిలోని తోయగూడ గ్రామానికి చెందిన కొడప రాంబాయి మృతి చెందడంతో వాగుదాటలేక మృతదేహాన్ని ఎడ్లబండ్ల సాయంతో ఊరికి చేర్చారు.
హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండీ, చిలకలగూడ, బేగంపేట, ప్యారడైజ్‌, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత నగరంలో వర్షం కాస్త తగ్గడంతో ప్రజలు బయటకు రావడం కనిపించింది. హస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ హిమాయత్‌ నగర్‌లోని ఆదర్శ్‌ బస్తీలో ముంపునకు గురైన ప్రాంతంతోపాటు నల్లకుంటలోని పద్మ నగర్‌, నాగయ్య కుంట అడిక్‌మెట్‌ ప్రాంతాల్లో నాలా పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి పరిశీలించారు. హిమాయత్‌ నగర్‌ స్ట్రీట్‌ నెం.14 లోతట్టు ప్రాంతంలో గురువారం రాత్రి నుంచి నాలా పొంగి ఇండ్లలోని రావడంతో మాన్సూన్‌ ఎమర్జెన్సీ టీంతో పాటు డీఆర్‌ఎఫ్‌ టీంలు మోటర్లు పెట్టి నీటిని బయటకు పంపించారు.
ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీరు విడుదల
ఎగువన ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోనూ ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో మేడిగడ్డ బ్యారేజీ 75 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డలో 93.80 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అన్నారం బ్యారేజీ 56 గేట్లు ఎత్తి 1,26,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలో కడెం ప్రాజెక్టులోని 14గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాత్నాల, గడ్డెన్నవాగు, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని విడిచిపెడుతున్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్‌ మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగులపై నుండి నీరు పొంగిపొర్లుతూ మంజీరా నది ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి చేరుతుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. ఎల్లారెడ్డిలోని కల్యాణి ప్రాజెక్టుగేట్లు ఎత్తారు. నిజామాబాద్‌ జిల్లా సాలూర వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాని పై నుంచి రాకపోకలు నిషేదిస్తూ రెవెన్యూ అధికారులు కందకం తవ్వారు. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతికి శివాలయం మునిగిపోయింది. ఎస్సారెస్పీకి 59 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మెదక్‌ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా 20.136 టీఎంసీలకు చేరుకుందని ఇరిగేషన్‌ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ చెరువులకు వరద పోటెత్తింది. హిమాయత్‌సాగర్‌ రెండు గేట్లను ఎత్తి 700 క్యూసెకుల నీటిని దిగువకు వదిలారు.
43 అడుగుల వదద నిలకడగా భద్రాద్రి గోదారి
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 43 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతోంది. మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, కలెక్టర్‌ ప్రియాంక అలా భద్రాచలం బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. లోతట్టు ప్రాంత ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి సూచించారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌ మొత్తం 24 గేట్లకు గాను 16 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి 50,745 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

Spread the love