– ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం
– ఆ రాష్ట్ర సీఎం రాజీనామాకు డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
మణిపూర్‌లోని కాంగ్‌ఫోక్సీ జిల్లాలో కుకీ తెగకు చెందిన ఇద్దరు ఆదివాసీ మహిళలను నగంగా ఊరేగించి లైంగికదాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. మణిపూర్ ఆకృత్యాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
ఐద్వా, కెేవీపీఎస్, డీివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. మణిపూర్‌లో మహిళలపై సాగుతున్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించి బాధిత మహిళల కుటుంబ సభ్యులను హత్య చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయని అన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, సహాయ కార్యదర్శి గాదె నరసింహ, బొల్లు రవీందర్, తక్కెళ్ళపల్లి శ్యామ్, ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, అధ్యక్షులు తుమ్మల పద్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మిర్యాలగూడలో సీఐటీయూ, బంజారా, గిరిజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. దేవరకొండలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో ఐద్వా ఆధ్వర్యంలో ఏఎంసీ కాలనీలో నిరసన తెలిపారు. కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని పాత కొత్తగూడెం గౌతమ్‌నగర్ చౌరస్తాలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్‌లో ఐద్వా, పీఓడబ్ల్యూ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ, డీవైఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.