సామాజిక అసమానతలు పెంచుతున్న పాలకులు

– రైల్వే ప్రమాదంపై ప్రధాని మోడీ పూర్తి బాధ్యత వహించాలి
–  కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ
–  రాష్ట్ర సామాజిక శిక్షణా తరగతులు ప్రారంభం
నవతెలంగాణ- కల్వకుర్తి
రాష్ట్రంలో సామాజిక అసమానతలు పెంచేందుకు పాలకులు కుట్రలు చేస్తున్నారని కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌ వెస్లీ అన్నారు. సోమవారం నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్‌ హాల్‌లో కేవీపీఎస్‌ రాష్ట్ర సామాజిక శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేండ్ల కిందట అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సామాజిక అసమానతలు పెంచుతూ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రజాస్వామ్యవాదులు విశాల ఉద్యమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఒడిశాలో జరిగిన రైల్వే ప్రమాదంపై ప్రధాని మోడీ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. రైల్వే శాఖలో దాదాపు రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీ ఉంటే మోడీ ప్రభుత్వం ప్రయివేటు పరం పేరుతో రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేశారని, అందుకే ఈ ప్రమాదం జరిగిందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయాలపై దృష్టి పెట్టింది తప్ప ప్రజల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. రైల్వే ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో కెేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, ఉపాధ్యక్షులు కురుమయ్య, నాయకులు రాధాకృష్ణ, గోపి, మంద సంపత్‌, పరుశరాములు, రామ్మూర్తి, రాధిక, ప్రకాష్‌, దేవేందర్‌, ముంతటికాశన్న, బాలపీరు, గంగాధర్‌, మోహన్‌, నవీన్‌, సత్యనారాయణ, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love