21 తర్వాత సమ్మెలోకి వెళ్తాం

– గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి : జీపీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ
– పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్‌ రామారావుకి సమ్మె నోటీసు
 నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మల్టీపర్పస్‌ విధానం రద్దు, కారోబార్‌, బిల్‌కలెక్టర్లకు స్పెషల్‌ స్టేటస్‌, జీవో నెంబర్‌ 60 అమలు, తదితదిర డిమాండ్లను నెరవేర్చాలనీ, లేదంటే ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర సర్కారుకు అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభి వృద్ధి శాఖ కమిషనరేట్‌లో డిప్యూటీ కమిషనర్‌ రామారావుకు జేఏసీ ఆధ్వ ర్యంలో 17 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్ర మంలో జేఏసీ చైర్మెన్‌ ఎన్‌.యజ్ఞనారాయణ, కోశాధికారి సీహెచ్‌ సదా నందం, కన్వీనర్లు చాగంటి వెంకటయ్య, పి.అరుణ్‌కుమార్‌, పి.శివ బాబు, జయచంద్ర, కోకన్వీనర్లు వెంకటరాజ్యం, ఆర్‌.మధు సూదన్‌రెడ్డి, పాలడుగు సుధాకర్‌, ఆర్‌కే.నాయుడు, జేఏసీ సభ్యులు సామల శ్రీకాంత్‌, వెంకట్రా ములు, డి.యాదయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా వేతనాలివ్వాలని కోరారు. పీర్సీలో కనీస వేతనంగా నిర్ణయించిన రూ.19 వేలను వేతనంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కారోబార్‌, బిల్‌కలెక్టర్లకు స్పెషల్‌ స్టేషన్‌ కల్పించాలనీ, వారిని సహాయ కార్యదర్శులుగా నియమించాలనీ, అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌కే.డే ఇన్సూరెన్స్‌ పథకాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలనీ, అవసరమున్న చోట కొత్త సిబ్బందిని నియమిం చాలని కోరారు. పంచాయతీ కార్మికులు, ఉద్యోగులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ప్రమాదబీమా, యూనిఫారాలు, అలవెన్స్‌లు, తదితర సౌకర్యాలను వర్తింప జేయాలని విన్నవించారు. ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలను ఆదుకో వాలనీ, దహనసంస్కారాలకు ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వాలని కోరారు.

Spread the love