రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసర సరుకులివ్వాలి

– 19న తహశీల్దార్‌ కార్యాలయాల ముట్టడి : పీవైఎల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను ప్రజలకు పంపిణీ చేయాలని పీవైఎల్‌ డిమాండ్‌ చేసింది. ఇదే అంశంపై ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా పీవోడబ్ల్యూతో కలిసి తహశీల్దార్‌ కార్యాయాలను ముట్టడించనున్నట్టు పిలుపునిచ్చింది. ఈ మేరకు పీవైఎల్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కాశీనాథ్‌, కెఎస్‌ ప్రదీప్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత పాలకులు చౌక ధరలకే నిత్యావసర సరుకులు పేదలకు అందించారని గుర్తు చేశారు. ఇప్పుడు వాటిని రద్దుచేసి ధరలు విపరీతంగా పెంచేలా చేశారని విమర్శించారు. దీంతో రెక్కల కష్టం మీద ఆధారపడిన పేదలు దిన దిన గండంగా బతుకుతున్నారని తెలిపారు. రేషన్‌ షాపులో సన్న బియ్యం కూడా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. గ్యాస్‌ ధరలు రూ.1,200 వరకు పెంచారని, దీంతో పేదలకు గ్యాస్‌ వాడడం ఆర్థిక భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల సగం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కోరారు. రేషన్‌ డీలర్ల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. వారికి గౌరవ వేతనం ఇవ్వాలని, తరుగు వచ్చే విషయంపై అధికారులు స్పందించాలని కోరారు. కరోనా కాలంలో మరణించిన డీలర్ల కుటుంబాలను ఆదుకోవాలని పేర్కొన్నారు.

Spread the love