కుల వివక్ష పాటించిన దుండగులను శిక్షించాలి : కేవీపీఎస్‌

వతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కుల వివక్షను పాటించిన దుండగులను చట్టపరంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాటసంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్‌ మండల్‌ తిమ్మాపూర్‌ గ్రామంలో దళితులకు సెలూన్‌ షాపులో క్షవరం చెయ్యమంటూ, చెట్టు కింద మాత్రమే చేస్తామంటూ కులవివక్ష పాటించటం అత్యంత హేయమని తెలిపారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమాన పరుస్తున్న తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షులు మరి కొంతమంది పెద్దలు దశాబ్ది దినోత్సవాల సమయంలో చెరువు పండుగ భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు అన్ని కులాలు చెందిన వారికి సమానంగా భోజనం పెట్టాలి కానీ, దళితులు మీరు వడ్డీస్తారా అంటూ అవమానపరిచారని తెలిపారు. గ్రామానికి చెందిన కొంతమంది పెద్దలు ఆదేశంతోనే సెలూన్‌ షాప్‌లో మాదిగలకు క్షవరం చెయ్యమంటూ అగౌరవ పర్చారని పేర్కొన్నారు.
అవమానం భరించలేక దళితులు స్థానిక తహశీల్దార్‌, ఎస్‌ఐలకు ఫిర్యాదు చేశారని తెలిపారు. 24 గంటలైనా ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో తహశీల్దార్‌ ఆఫీసు వద్ద దళితులు ధర్నా నిర్వహించారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలోనే వివక్షత ఈ రకంగా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వివక్షత రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను డిమాండ్‌ చేశారు తక్షణమే ఈ చర్యలకు కారకులైన ప్రతీ ఒక్కరి పై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love