– పైలుపై సీఎం సంతకం
– ఈ నెల నుంచే అమలు..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలతోపాటు పలు శాఖలకు అనుబం ధంగా నడుస్తున్న హాస్టళ్ల మెనూ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచనున్నది. ఈ మేరకు సీఎం కేసీఆర్ శనివారం సచివాలయంలో డైట్ చార్జీలను పెంచుతూ సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. పెరిగిన చార్జీలు జూలై నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనాన్ని అందింస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పెరిగిన డైట్’ చార్జీల వివరాలు :
తరగతి– ప్రస్తుతం(రూ)–పెరిగింది(రూ.)
మూడు నుంచి ఏడు వరకు-950-1,200
ఎనిమిది నుంచి పది వరకు-.1,100 -1,400
11 నుంచి పీ.జీ వరకు-1,500 -.1,875
టీఎస్ యూటీఎఫ్ హర్షం..
ఈ నెల నుంచి గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల మెస్ చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీఎస్‌యూటీఎఫ్ స్వాగతిస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేవీపీఎస్ హర్షం
హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచటం పట్ల కుల వివక్ష వ్యతిరేక పోరాటం సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్ వెస్లీ, టి స్కైలాబ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
పోరాటాల ఫలితమే..మెస్ చార్జీల పెంపు-ఎస్‌ఎఫ్‌ఐ
డైట్ చార్జీలతో పాటు కాస్మొటిక్ చార్జీలు పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టి నాగరాజు శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలతో పోల్చి చూసినప్పుడు పెరిగిన డైట్ చార్జీలు కేవలం కంటి తుడుపు చర్యమాత్రమేనని పేర్కొన్నారు. పెరిగిన ధరలతో సమానంగా డైట్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎనిమిది నెల్లుగా పెండింగ్‌లో ఉన్న డైట్ బిల్లులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.కాస్మొటిక్ చార్జీలు నెలకు బాలురకు రూ.62, బాలికలకు రూ.100, ప్రిమెట్రిక్ హాస్టళ్లలో ఇస్తున్నారని తెలిపారు. ఇవి ఏ మాత్రం సరిపోవని పేర్కొన్నారు. నెలకు బాలురకు రూ.500, బాలికలకు రూ.1000ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళాశాల వసతి గృహాల విద్యార్థులకు నెలకు రూ.1500పాకెట్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.