– జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
– పౌరోహిత్యం లేని పూలదండల పెండ్లిండ్లను ఆదరించాలి: కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-కంగ్టి
‘వరకట్నం ఒక సాంఘిక దురాచారమని, కుల మతాంతర ఆదర్శ వివాహాలను అందరూ ప్రోత్సహిం చాలని జుక్కల్ శాసనసభ్యులు హనుమంతు షిండే పిలుపునిచ్చారు. పౌరోహిత్యం లేకుండా వరకట్నాన్ని నిషేధిస్తూ మార్క్స్, పూలే, అంబేద్కర్ దంపతుల స్ఫూర్తితో పూలదండల పెళ్లిండ్లను పౌర సమాజం ఆదరించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరా గ్రామంలో షిండే పూజ, కిందిదొడ్డి సతీష్‌ల ఆదర్శ వివాహాన్ని స్కైలాబ్ బాబు ప్రమాణ పత్రాలు చదివించి పూలదండలు మార్చుకోవడం ద్వారా వివాహాన్ని జరిపించారు. మనువాద బ్రాహ్మణులు జరిపించే పెండ్లిలో చదివే వేదమంత్రాలు.. ఒక్క బ్రాహ్మణునికి తప్ప ఎవరికీ అర్థం కాదన్నారు.
పౌరోహిత్యం ద్వారా జరిగే పెండ్లి మూఢత్వం, మనువాదంతో కూడుకున్నవని తెలిపారు. కట్నం లేకుండా, పురోహితుడు, వేదమంత్రాలు లేకుండా నేటి యువతరం మార్క్స్, పూలే, అంబేడ్కర్ తరహాలో చాలా సర్వసాధారణంగా పూలదండలతో పెళ్లిండ్లు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిండు నూరేండ్లు జీవితాన్ని ఒక లక్ష్యం కోసం కొనసాగించాలన్నారు.
నేటితరం ప్రేమ పెళ్లిండ్ల్లు పూర్తిస్థాయిలో ప్రోత్సహించాలన్నారు. మనవాద సమాజం విద్వేషాలను రెచ్చగొట్టి కులదురహంకార హత్యలకు పాల్పడితే, అభ్యుదయ వాదులు ఆదర్శ వివాహాల్ని ప్రోత్సహిస్తూ ప్రేమానురాగాలు పంచి మనుషుల మధ్య ఐక్యతను సాధించాలని పిలుపునిచ్చారు. ఆదర్శ వివాహంలో సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, సీపీఐ(ఎం) నారాయణఖేడ్ ఏరియా కమిటీ కార్యదర్శి చిరంజీవి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొటారి నర్సింలు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రమేష్, జిల్లా అధ్యక్షులు మహేష్, సామాజిక ఉద్యమకారులు గాజుల పాడ్ సంతోష్, కేవీపీఎస్ కంగ్టి మండల అధ్యక్షులు రాహుల్, కేవీపీఎస్ నాయకులు శంకర్, రాములు తదితరులు పాల్గొన్నారు.