బీజేపీ ఎంపీని అరెస్టు చేయాలి

– లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
– రెజ్లర్లకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన
– దిష్టిబొమ్మలు దహనం

నవతెలంగాణ-ముషీరాబాద్‌/విలేకరులు
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేసి, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్‌ చేశారు. సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఆల్‌ ఇండియా అగ్రికల్చర్‌ వర్కర్స్‌ యూనియన్‌, ఐద్వా, డీవైఎఫ్‌ఐ ఎస్‌ డబ్ల్యూ ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల జాతీయ కమిటీ పిలుపులో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో చుక్క రాములు మాట్లాడారు. తమకు న్యాయం చేయాలంటూ 25 రోజులుగా ఢిల్లీలో మహిళా రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తుంటే.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళా రెజ్లర్లు దేశ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికల మీద ఇనుమడింపజేశారని, వారికి రక్షణ కల్పించకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోక పోగా దోషులకు అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఓవైపు భేటి బచావో భేటి పడావో అంటూ.. మరోవైపు మహిళలపై దాడులు జరుగుతుంటే పట్టించుకోవట్లేదన్నారు. అలాగే, నిరసన దీక్ష చేపట్టిన మహిళా రెజ్లర్లపై పోలీసు నిర్బంధం ప్రయోగించడం బాధాకర మన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎంపీని అరెస్టు చేసి నిష్పక్షపాతంగా కేసును విచారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య, కార్యదర్శులు భూపాల్‌, జె. వెంకటేష్‌, రాష్ట్ర నాయకులు యాటల సోమన్న, ఎస్‌.రామ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆమనగంటి వెంకటేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు శోభన్‌ నాయక్‌, సీఐటీయూ నగర అధ్యక్ష కార్యదర్శులు ఎం.వెంకటేష్‌, జె.కుమారస్వామి, కోశాధికారి ఆర్‌.వాణి, అజ రు బాబు, డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఎండీ జావేద్‌, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్య దర్శి అశోక్‌ రెడ్డి, ఆంజనేయులు, మల్లికార్జున తదితరులు పాల్గొ న్నారు. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ అంబేద్కర్‌ చౌరస్తా దగ్గర నిరసన తెలిపారు.
మహిళా రెజ్లర్స్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ చరణ్‌సింగ్‌ను అరెస్టు చేసి, పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ జంక్షన్‌లో సీఐటీయూ, ఐద్వా, గిరిజన సంఘం, కేవీపీఎస్‌, ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో సీపీఐ(ఎం), ఏఐకేఎస్‌, సీఐటీయూ, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన ప్రదర్శన చేపట్టారు.
మహిళా రెజ్లర్స్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వికారాబాద్‌ జిల్లా పరిగి పట్టణంలో సీపీఐ(ఎం), వ్యకాస ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేసి, రెజ్లర్లకు న్యాయం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రెజ్లర్ల చేస్తున్న న్యాయపోరానికి సంఘీభావం తెలుపుతూ కాటేదాన్‌ చౌరస్తాలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఐద్వా, సీఐటీయూ, రైతు సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ మాట్లాడారు. బీజేపీ ఎంపీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. భువనగిరి జిల్లా కేంద్రంలో వ్యకాస, ఐద్వా, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

Spread the love