జీపీ కార్మికుల వల్లే అవార్డులు

– వారి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
– కనీస వేతనం అమలు చేయాలి
– మల్టీపర్పస్‌ పని విధానాన్ని రద్దు చేయాలి :తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మిక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌
– రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకెళ్లిన జీపీ కార్మికులు
నవతెలంగాణ- విలేకరులు
”కార్మికుల కష్టం వల్లే గ్రామ పంచాయతీలకు ఎన్నో ఉత్తమ అవార్డులు వస్తున్నాయి.. దేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరిగింది. అలాంటి కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.. కనీస వేతనం లేదు.. ఏండ్ల తరబడి పనిచేస్తున్నా పర్మినెంట్‌ లేదు.. మల్టీపర్పస్‌ పని విధానంతో శ్రమ దోపిడీకి గురవుతున్నారు..” అని తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మిక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మెన్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జీపీ కార్మికులు గురువారం సమ్మెలోకెళ్లారు. విధులను బహిష్కరించి ఎంపీడీవో కార్యాలయాల ఎదుట దీక్షలు ప్రారంభించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌, ఎర్రుపాలెం మండల ఎంపీడీవో కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికుల దీక్షలను పాలడుగు భాస్కర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల కృషి వల్లే రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక అవార్డులు పొందగలిగిందని చెప్పారు. అటువంటి కార్మికులను పర్మినెంట్‌ చేయకుండా.. వేతనాలు పెంచకుండా సీఎం కేసీఆర్‌ తీవ్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. మల్టీ పర్పస్‌ విధానం రద్దు చేసి.. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమస్య లు పరిష్కరించాలని పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. జీవో 60 ప్రకారం పంచాయతీ సిబ్బందికి రూ.19,500 కనీస వేతనం అమలు పరచాలని డిమాండ్‌ చేశారు. చింతకానిలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎర్ర శ్రీకాంత్‌ జీపీ కార్మికులకు పూలమాలలేసి దీక్షలను ప్రారంభించారు. కొణిజర్లలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వై.విక్రమ్‌ దీక్షలను ప్రారంభించారు. ముదిగొండలో కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. మధిరలో టీడీపీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి రామనాథం సంఘీభావం తెలిపారు. తల్లాడలో సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు దీక్షలను ప్రారంభించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట జేఏసీ జిల్లా కన్వీనర్‌ ఏజే రమేష్‌, సీఐటీయూ జిల్లా నాయకులు ఎంబి నర్సారెడ్డి దీక్షను ప్రారంభించారు. మణుగూరులో ఐఎఫ్‌టీయూ నాయకులు సంఘీభావం తెలిపారు. చర్లలో కేవీపీఎస్‌, మహిళా సంఘం, ఆటో యూనియన్‌ సంఘీభావం తెలిపాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సమ్మెలో భాగంగా తొలి రోజు కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన సమ్మెలో తెలంగాణ గ్రామ పంచాయతీ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు సుధాకర్‌ మాట్లాడారు. కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచి ర్యాల, నిర్మల్‌ జిల్లా కేంద్రాల్లోనూ పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించారు.మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండల కేంద్రంలో గ్రామ పంచాయితీ కార్మికులు సమ్మెచేశా రు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్‌ మాట్లాడుతూ.. నెల నెలా జీతాలు చెల్లించాలని, మల్టీపర్పస్‌ పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.రంగారెడ్డి జిల్లా కందుకూర్‌ మండలంలో శ్రీశైలం ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. చేవెళ్ల పట్టణం లోని అంబేద్కర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. శంకర్‌పలి ్లలో ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. షాబాద్‌లో బాబు జగ్జీవన్‌రాం విగ్రహానికి నివాళి అర్పించారు. మంచాల, యాచారం మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట పంచాయతీ కార్మికుల దీక్షల్లో రంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మెన్‌ గ్యార పాండు పాల్గొని మాట్లాడారు. తాండూర్‌ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు.యాదాద్రిభువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ జిల్లా నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి సమ్మెకు మద్దతు తెలిపారు. నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలం కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. నల్లగొండ ఎంపీడీవో ఆఫీస్‌ ముందు కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభించారు. పెద్దవూరలో గ్రామపంచాయతీ కార్మికులు స్థానిక అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. జనగామ జిల్లా పరిషత్‌, ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ సిబ్బంది, కార్మికులు నిరసన తెలిపారు. వరంగల్‌ జిల్లా నర్సంపేటలో మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట సమ్మె ప్రారంభించారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లోని మండల కేంద్రాల్లో కార్మికులు టెంట్‌ వేసుకుని సమ్మె చేశారు. వీరికి సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.

Spread the love