అడిగినవన్ని మంజూరు చేసిన సీఎం

కేసీఆర్‌ ఆశయం నెరవేరేలా కృషి చేయాలి :మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్యశాఖకు అడిగినవన్నీ సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారని ఆ శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆశయం నెరవేరేందుకు కృషి చేయాలని వారికి సూచించారు. బోధనాస్పత్రుల పనితీరుపై సోమవారం ఆయన నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పెద్ద మొత్తంలో బడ్జెట్‌ కేటాయింపులతో పాటు కొత్త మెడికల్‌ కాలేజీలు, వైద్యుల నియామకం, వైద్యపరికరాలను ఇచ్చారని గుర్తుచేశారు. ఆ రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. మున్ముందు నెంబర్‌వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో 21 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో రికార్డు సృష్టించామని గుర్తుచేశారు. 1.061 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం తర్వాత బోధనాస్పత్రులు బలోపేతమయ్యాయని తెలిపారు. 2014లో మాతృ మరణాల రేటు 92గా ఉంటే దాన్ని 43కు తగ్గించగలిగామని చెప్పారు. మెడికల్‌ కాలేజీల్లో ర్యాగింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. శిక్షణా భృతి, వేతనాలు వేతనాలు ఆలస్యం కాకుండా సూపరింటెండెంట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిమ్స్‌ కొత్త బ్లాక్‌ భూమిపూజ ఏర్పాట్లు పరిశీలన
బుధవారం వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కొత్త బ్లాకు నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నారు. సంబంధిత ఏర్పాట్లను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. సోమవారం వైద్యారోగ్య, రోడ్లు, భవనాలశాఖ అధికారులతో కలిసి ఆయన అక్కడ పర్యటించారు. సీఎం భూమిపూజ అనంతరం నిర్వహించే సభ ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు చేశారు. అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని కోరారు. వచ్చిన వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి ట్రాఫిక్‌ సమస్య రాకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నిమ్స్‌ విస్తరణ పనుల్లో భాగంగా రూ.1,571 కోట్లతో రెండు వేల పడకలతో కొత్త బ్లాక్‌ ను నిర్మించనున్న సంగతి తెలిసిందే.

 

Spread the love