అందరూ థెరపిస్టులే సామాజిక మాధ్యమాలే వేదిక

– ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌లతో ప్రజల జీవితాలతో ఆటలు
– హెచ్చరిస్తున్న ఆరోగ్య,వైద్య నిపుణులు
భారత్‌లో సామాజిక మాధ్యమాల వాడకం తీవ్రంగా పెరిగింది. పిల్లల నుంచి పెద్దల వరకు.. సోషల్‌ మీడియాను అధికంగా వాడుతున్నారు. అలాగే, ఇటు సోషల్‌ మీడియా ద్వారా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఎందరో అనామకులు సైతం ప్రభావశీలురుగా మారుతున్నారు. ప్రజలు ఇప్పుడు సోషల్‌ మీడియా మాయలో పడిపోయారు. ముఖ్యంగా, కరోనా, తదనంతర పరిస్థితులు ఈ మార్పునకు కారణమవుతున్నాయి. పేరు కోసమో, సంపాదన కోసమో, ప్రభావితం చేయాలన్న లక్ష్యమో.. ఏదైనప్పటికీ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండాలని పలు సోషల్‌ మీడియా ఖాతాల నిర్వాహకులు తహతహలాడుతున్నారు.
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాలే వేదికగా థెరపిస్టుల అవతారమెత్తుతున్నారు. నిపుణులు కాకపోయినప్పటికీ, విషయంపై అవగాహన లేకున్నా.. ఆన్‌లైన్‌లో సలహాలు, కౌన్సిలింగ్‌లు ఇస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లలో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. బయటకు వెళ్లి వైద్యులను కలిసి డబ్బు వృథా చేసుకోవడం ఎందుకని ఆలోచిస్తున్న కొందరు.. ఈ ఆన్‌లైన్‌ థెరపిస్టులు ఇస్తున్న సలహాలను, సూచనలను పాటిస్తూ కష్టాలను కొనితెచ్చుకుంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసోం రాజధాని గువహతికి చెందిన 36 ఏండ్ల ఆస్పత్రి నిర్వాహకురాలు ఇలాగే ఆన్‌లైన్‌లో ఎదురైన తన అనుభవాన్ని పంచుకున్నది. నెల రోజుల ముందు పెండ్లిని రద్దు చేసుకున్న ఆమె.. తీవ్రంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ సమయంలో ఆమె ఒక మొబైల్‌ యాప్‌ ద్వారా అజ్ఞాత ‘థెరపిస్టు’ను సంప్రదించింది. ఉచిత చాట్‌ సెషన్‌ ద్వారా కౌన్సెలర్‌గా పిలవబడే ఒక వ్యక్తి కొన్ని కథలను ఆ మహిళకు చెప్పటం ప్రారంభించాడు. అయితే, వారు ఇచ్చిన సలహాలు, సూచనలు భరించలేక వెంటనే సెషన్‌ను ముగించినట్టు చెప్పింది. ఆన్‌లైన్‌లో ఇలాంటి వ్యక్తులపై నియంత్రణ, వారి అర్హతలు, శిక్షణ, ప్రమాణాల పూర్తి భయంకరమైన లోపాన్ని హైలైట్‌ చేస్తున్నదని నిపుణులు హెచ్చరించారు. రెండు రోజుల తర్వాత కౌన్సెలర్‌గా మారాలనుకుంటున్నారా అని యాప్‌ నుంచి సదరు మహిళకు ఒక సందేశం రావటం గమనార్హం.
మానసిక ఆరోగ్యం గురించి బహిరంగ చర్చలకు దూరంగా ఉన్న సమాజంలో థెరపీ కీలకంగా మారింది. అయితే, ఇలాంటి తరుణంలో ఆన్‌లైన్‌ సెషన్‌లు అతిపెద్ద వద్ధిని సాధించాయి. అనేక ఫోన్‌ యాప్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, వ్యక్తిగత వెబ్‌సైట్లు, క్లినిక్‌లు వంటి వేదికలు కౌన్సెలింగ్‌ సేవలను అందిస్తున్నాయని నిపుణులు చెప్పారు. ప్రభావశీలురు కూడా చికిత్సకులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇది సమాజంలోని ప్రజల ఆరోగ్యంపై దుష్పరిణామాలను చూపే అవకాశమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
థెరపిస్ట్‌లుగా వ్యవహరిస్తున్న వ్యక్తుల టాక్‌ సెషన్‌లు, లిజనింగ్‌ లేదా లైఫ్‌ కోచింగ్‌ వంటి పదాలను ఉపయోగించే కౌన్సెలింగ్‌ వ్యాపారం విస్తరిస్తున్నది. మానసిక వ్యాధుల పట్ల అవగాహన పెరగడం వల్ల ఈ సేవలకు డిమాండ్‌ పెరిగింది. కానీ వైద్య వృత్తికి భిన్నంగా, కౌన్సెలింగ్‌ ఫీల్డ్‌ ప్రస్తుతం తాత్కాలిక ప్రమాదకరమైన దశలో ఉన్నదనీ, దీనిపై సరైన నియంత్రణ లేదని ఆరోగ్య నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ” కేవలం మాస్టర్స్‌ డిగ్రీ లేదా షార్ట్‌ బ్రిడ్జ్‌ కోర్సు ఉన్న దాదాపు ఎవరైనా థెరపిస్ట్‌గా మారవచ్చు. ఇది తమను తాము కౌన్సెలర్లుగా చెప్పుకునే అర్హత లేని వ్యక్తుల ప్రవేశానికి దారి తీస్తుంది” అని చెపుతున్నారు. ”వ్యవస్థ చాలా విచ్ఛిన్నమైంది. సోషల్‌ మీడియా కారణంగా, ప్రతి వ్యక్తి థెరపిస్ట్‌ అని చెప్పుకుంటున్నారు. అది మరింత దారుణం. అర్హత లేని, అసమర్థ థెరపిస్ట్‌ల వద్దకు వెళ్లి ఇప్పుడు తిరిగి థెరపీకి వెళ్లాలని కోరుకోని వ్యక్తులు ఉన్నారు ”అని నోయిడా, ఢిల్లీలో కేంద్రాలను నిర్వహిస్తున్న ‘ఐ యామ్‌ వెల్‌బీయింగ్‌ ఆర్గనైజేషన్‌’ వ్యవస్థాపకురాలు ఆకాంక్ష చండేలే చెప్పారు.
అమలు కాని చట్టాలు
2021లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రంగాన్ని నియంత్రించేందుకు నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషన్స్‌ యాక్ట్‌ను ఆమోదించింది. కౌన్సెలింగ్‌ సైకాలజీలో విద్యా ప్రమాణాలను ఏర్పాటు చేయడం, సంస్థలను అంచనా వేయడం, వారి నైపుణ్యం , సామర్థ్యాలను అంచనా వేసిన తర్వాత నిపుణుల యొక్క సెంట్రల్‌ రిజిస్టర్‌ను నిర్వహించడం ఈ చట్టం ఉద్దేశ్యం. అయితే ఈ చట్టం ఇంకా అమలుకు నోచుకోలేదు. ఈ సమయంలో, పర్యవేక్షణ లేకపోవడంతో ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయని నిపుణులు తెలిపారు. ఇది మరింత హాని కలిగించవచ్చని హెచ్చరించారు. ఈ ట్రెండ్‌ ఈ రంగాన్ని చాలా ఏండ్లు వెనక్కి తీసుకెళ్తున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Spread the love