మోడీ సభను విజయవంతం చేయాలి

– పార్టీ శ్రేణులకు ఈటల రాజేందర్‌ పిలుపు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
పైకి లేచి ఒక్కటేసారి కిందకు పడిపోవడానికి బీజేపీ సెన్సెక్స్‌ కాదని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్‌ ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. హన్మకొండ జిల్లాలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో ఈ నెల 8న జరగనున్న ప్రధాని మోడీ బహిరంగసభ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించిన ఆయన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుటుంబ పాలనకు అంతం పలికేది బీజేపీ మాత్రమేనన్నారు. బీజేపీపై అసహనంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని కొందరు దుష్ప్రచారం చేస్తూ విషం కక్కుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ప్రధాని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఒంటరి మహిళలకు ఇచ్చే ఫించన్‌ నాలుగేండ్లుగా నిలిచిపోయిందన్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోడీ వరంగల్‌కు రానున్నారని, ఈ సందర్భంగా జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. విజయరామారావు, ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌ రెడ్డి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, వరంగల్‌ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, వన్నాల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love