చల్లారని మణిపూర్‌

– తాజా అల్లర్లలో మరో నలుగురి మృతి
– 40 మంది ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌ : సీఎం
ఇంఫాల్‌ : బీజేపీ పాలిత రాష్ట్రం మణిపూర్‌లో హింసాకాండ నేటికీ కొనసాగుతోంది. ఆదివారం వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం సుగ్ను ప్రాంతంలో స్థానికులపై గుర్తు తెలియని సాయుధ దుండగులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు. ఫాయెంగ్‌ ప్రాంతంలో మరొకరు మృతి చెందారు. అనేక ప్రాంతాల్లో సాయుధ దుండగులకు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఇంఫాల్‌ చేరుకున్న ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే
రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మణిపూర్‌లో మెజారిటీ కమ్యూనిటీ మీటేలకు ఎస్‌టీ హోదా ఇవ్వాలన్న నిర్ణయంపై గిరిజనులకు, మీటేలకు మధ్య ఘర్షణలు ఈ నెల 3 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ లెక్కల ప్రకారమే హింసాకాండలో 70 మందికి పైగా మరణించగా, 200 మంది వరకూ గాయపడ్డారు. సుమారు నాలుగు వేలకుపై ఇండ్లు పూర్తిగానూ, పాక్షికంగానూ దగ్ధమయ్యాయి. వాస్తవానికి హింసా కాండ తీవ్రత మరింత అధికంగా ఉంది. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. మొబైల్‌ ఇంటర్నెట్‌ను నిషేధించారు.
40 మంది ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేశాం : బీరేన్‌ సింగ్‌
మణిపూర్‌లో 40 మంది ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చామని ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ఆదివారం సాయంత్రం ప్రకటించారు. ‘ఉగ్రవాదులు ఎం-16, ఎకె-47 అసాల్ట్‌ రైఫిల్స్‌, స్నిపర్‌ గన్లతో పౌరులపై విరుచుకుపడుతున్నారు. గ్రామాల్లో ఇళ్లను తగలబెడుతున్నారు. వీరిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. సైన్యం, ఇతర భద్రతా దళాల సిబ్బంది సహాయంతో వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాం. ఇప్పటి వరకూ జరిగిన ఎన్‌కౌంటర్లలో 40 మంది ఉగ్రవాదులను కాల్చివేశాం’ అని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 34 వేల మంది కేంద్ర బలగాలు మోహరించి ఉన్నాయని చెప్పారు.
నేడు అమిత్‌ షా రాక
మణిపూర్‌లో పరిస్థితిని సమీక్షించడానికి మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం రాష్ట్రానికి చేరుకోనున్నారు. రాష్ట్ర అధికారులు, ఆర్మీ అధికారులతో చర్చలు జరపనున్నారు. ఘర్షణలు జరుగుతున్న సామాజిక వర్గాల మధ్య చర్చలు ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రి చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మణిపూర్‌లో అల్లర్లు ప్రారంభమైన నెల రోజుల తరువాత కేంద్ర హోం మంత్రి రాష్ట్రానికి రావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.

Spread the love