మణిపూర్‌లో ఆగని హింస

– బిష్ణోపూర్‌ జిల్లాలో ఒకరి మృతి
– మరో ఇద్దరికి గాయాలు
ఇంఫాల్‌ : మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. బుధవారం బిష్ణోపూర్‌ జిల్లాలో చెలరేగిన ఘర్షణల్లో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు మూడు ఇళ్లను తగుల పెట్టారు. మొయిరాంగ్‌లో సమీపంలోని పలు గ్రామాలపై సాయుధ యువకులు బుధవారం తెల్లవారు జామున దాడులకు తెగబడ్డారు. ఒక సామాజిక తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని తుపాకీలతో కాల్పులు జరిపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ఒకరు మరణించారు. మంగళవారం ఇదే జిల్లాలోని ఫౌబక్చావో వద్ద నాలుగు ఇళ్లను దగ్ధం చేయగా..ఆ ఘటనకు ప్రతీకారంగానే బుధవారం దాడులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 3 నుంచి మణిపూర్‌లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. బిజెపి ప్రభుత్వం వైఫల్యంతోనే ఈ హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ తన ఆధీనంలోనే హోం శాఖను ఉంచుకున్నా.. సామాజిక తరగతుల మధ్య ఘర్షణలను నివారించి శాంతిభద్రతను పునరుద్దరించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో బిజెపి నాయకులే హింసాకాండను ప్రేరేపిస్తుండటంతో ముఖ్యమంత్రి చేవలేనివాడిగా మిన్నుకుండిపోతున్నారు. బుధవారం నాటి ఘర్షణల నేపథ్యంలో బిష్ణుపూర్‌, ఇంఫాల్‌ తూర్పు, ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలను పునరుద్ధరించారు.

Spread the love