ఇంఫాల్ : మణిపూర్‌లో తాజాగా మళ్లీ అల్లర్లు తలెత్తడంతో రాష్ట్రంలో పరిస్థితి ఉద్రికత్తంగా ఉంది. సోమవారం ఇంఫాల్ తూర్పు జిల్లాలో అల్లర్లు రేగిన సంగతి తెలిసిందే. న్యూ చెకాన్ ప్రాంతంలో బలవంతంగా దుకాణాలను మూయించడంతో పాటు, రెండు ఇళ్లను కూడా దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా ప్రజలు భయభయంగా గడిపారు. అనేక ప్రాంతాల్లో దుకాణాలను తెరవలేదు. అలాగే ప్రజలు ఇంటి లోపలే ఉండాలని భద్రతా సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అలాగే పుఖావో, లీటాన్‌పోక్సి వంటి కొన్ని ప్రాంతాల్లో స్థానికులే తాతాల్కిక ‘బంకర్‌లు’ నిర్మించుకుని, అనుమతి ఉన్న తుపాకీలతో తమ ప్రాంతాల్లో భద్రతను ఏర్పాటు చేసుకున్నారు.
తాజాగా అల్లర్లు రేగడంతో కర్ఫ్యూ సడలింపును అధికారులు రెండు గంటలు తగ్గించారు. ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే కర్ఫ్యూను సడిలించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల మంది ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో మోహరించారు. మరో 20 కంపెనీల భద్రతా సిబ్బంది కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, డ్రోన్లు, మానవ రహిత విమానాలు ద్వారా వైమానిక నిఘాను భద్రతా సిబ్బంది నిర్వహిస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో ఇప్పటికే మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించారు.