ప్రాధాన్యతను మరిచిన ప్రధాని

– మోడీపై మణిపూర్‌ బీజేపీ ఎమ్మెల్యే నిరసన గళం
– అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని విమర్శ
– మానవత్వం చూపలేదని మండిపాటు
ఇంఫాల్‌ : మణిపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పవోలియన్‌లాల్‌ హోకిప్‌ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. హింసాకాండతో రాష్ట్రం అట్టుడుకుతుంటే మోడీ అమెరికాలో పర్యటించడాన్ని తప్పుపడుతూ సమస్య ప్రాధాన్యతను ఆయన ఏ మాత్రం అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. మణిపూర్‌ హింసపై మోడీ తొలిసారిగా పెదవి విప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ ’79 రోజుల పాటు పట్టించుకోలేదు. హింస చెలరేగుతున్న తరుణంలో వారం రోజులు కూడా సుదీర్ఘ సమయమే’ అని చెప్పారు. న్యూస్‌లాండ్రీ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీపై హోకిప్‌ నేరుగా విమర్శలు చేశారు. అమెరికా పర్యటనకు ముందు ప్రధానిని కలుసుకునేందుకు తాను చేసిన ప్రయత్నం ఫలించలేదని హోకిప్‌ తెలిపారు. ప్రజలు మారణహోమానికి బలవుతుంటే సమస్యను పరిష్కరించడంలో మానవత్వం చూపలేదని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధిగా ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరానని, అయితే ఆయన నుంచి స్పందన రాలేదని చెప్పారు. ఇప్పటికి కూడా పరిస్థితి తీవ్రతను ప్రధానికి వివరించే అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నామని అన్నారు. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పది మంది కుకీ ఎమ్మెల్యేలలో హోకిప్‌ ఒకరు. కుకీలకు ప్రత్యేక పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చిన్‌, కుకీ, మిజో, జోమీ గిరిజన తెగలను కాపాడడంలో తమ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలోని మైనారిటీ తెగలపై మెజారిటీ మైతీలు నిరాటంకంగా సాగిస్తున్న హింసకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ఆరోపించారు. కుకీ మహిళలపై లైంగిక దాడి జరిగిన విషయం తనకు తెలియదని ముఖ్యమంత్రి బీరేన్‌ చేసిన ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ ఇది వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకేనని అన్నారు. రాష్ట్రంలో హింసకు మైతీలు, పోలీసు కమాండోలే కారణమని నిందించారు.

Spread the love