బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు

– ఎంసీపీిఐ(యూ) రాష్ట్ర కమిటీ సమావేశంలో జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్‌ఓంకార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఎంసీపీఐ(యూ) జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్‌ఓంకార్‌ అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈనెల 4,5,6 తేదీలలో హైదరాబాద్‌లోని ఓంకార్‌భవన్‌లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశంలో అశోక్‌ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రానున్న సాధారణ ఎన్నికల్లో లబ్ది కోసం దేశంలో రాజకీయ విచ్చిన్నతలు, అప్రజాస్వామిక పద్దతుల్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నదని అన్నారు. బీజేపీ అసహనం, అహంభావం స్పష్టంగా బయట పడుతున్నాయని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమన్నారు. మణిపూర్‌ రావణకాష్టంలాగా కాలుతున్న ఆ శవాలపై తన రాజకీయ భవిష్యత్తు నిర్మాణం చేస్తున్నదని విమర్శించారు. దేశంలో రాజకీయ పార్టీలు అన్నింటినీ విచ్ఛిన్నం చేస్తూ ఆ పార్టీలు నేతలపై ఈడీ, సీబీఐలతో దాడులతో అవినీతి పరులనే ముద్రలేస్తూ లొంగదీసుకుంటున్నదన్నారు. అవినీతి పరులంతా బీజేపీలో చేరగానే పవిత్రులు ఎలా అవుతున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు ప్రమాదకరమని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ కూతురు కవితపై లిక్కర్‌ కేసు రాగానే బీజేపీ ముందు బీఆర్‌ఎస్‌ సాగిలపడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ పార్టీ ప్రజా సంఘాల నిర్మాణం బలోపేతం చేయడానికి ఈనెల 15,16 తేదీలలో నాగార్జునసాగర్‌లో రాష్ట్ర స్థాయి విస్తత సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్‌, వి,తుకారాం నాయక్‌, కుంభంసుకన్య, మందరవి, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love