యూసీసీకి మేం వ్యతిరేకం

–  ఇది మత స్వేచ్ఛను బలహీనపరుస్తుంది : డీఎంకే
 న్యూఢిల్లీ : తమిళనాడులోని అధికార డీఎంకే వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని వ్యతిరేకించింది. ఒకే రకమైన వ్యక్తిగత చట్టం మత స్వేచ్ఛను, సమాఖ్యను బలహీనపరుస్తుందని ఆరోపించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లును తీసుకురావటానికి కేంద్రంలోని మోడీ సర్కారు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 22వ లా కమిషన్‌ దేశ పౌరులు, మత సంస్థల నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నది. ఇందులో భాగంగా డీఎంకే యూసీసీని వ్యతిరేకిస్తున్నది. రాజ్యాంగ చెల్లుబాటుకు, మత సామరస్యానికి విఘాతం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. యూసీసీని అమలు చేసే ఏ ప్రతిపాదనకైనా డీఎంకే తీవ్ర వ్యతిరేకతను నమోదు చేసింది. 22వ లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియాకు వివరణాత్మక సమర్పణలో డీఎంకే యూసీసీపై ఆందోళనను వ్యక్తం చేసింది. యూసీసీని అమలు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25, 29కి ”అన్యాయమైన ఆక్రమణ” అని డీఎంకే వాదించింది. డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ లా కమిషన్‌కు తమ అభిప్రాయాన్ని అందజేశారు. యూసీసీ అమలుకు వ్యతిరేకంగా 2018 ఆగస్టులో 21వ లా కమిషన్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

Spread the love