మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– ఈ నెల 10,11,12 తేదీల్లో
– టోకెన్‌ సమ్మె : ఎస్వీ రమ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ.రమ డిమాండ్‌ చేశారు. మిడ్‌డేమీల్స్‌ కార్మికుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 10,11,12 తేదీల్లో టోకెన్‌ సమ్మె నిర్వహించబోతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో టోకెన్‌ సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.2 వేల వేతన పెంపును అమలు చేయాలని కోరారు. అప్పటినుండి జీఓ నెం.8 ప్రకారం ఎరియర్స్‌తో సహా చెల్లించాలని విన్నవించారు. కేటాయించిన బడ్జెట్‌ ప్రస్తుత మెనూకే సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. కొత్త మెనూ (రాగి జావ, అన్ని కూరగాయలతో కూర, వెజిటేబుల్‌ బిర్యానీ, ఆకు కూర పప్పు)ను పెట్టాలని ఒత్తిడి చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.. తక్షణమే కొత్త మెనూను సవరించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పజెప్పే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పోస్టరావిష్కరణలో ఆ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి ఉన్ని కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. సునీత, భారతి పాల్గొన్నారు.

Spread the love