11న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌

– 3.80 లక్షల మంది దరఖాస్తు
– నేటినుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు : టీఎస్‌పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈనెల 11న తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాతపరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించనుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఈ పరీక్ష జరుగుతుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది అక్టోబర్‌ 16న గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాతపరీక్ష కూడా జరిగింది. ఆ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, వారిలో 2,85,916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 25,150 మంది అభ్యర్థులను గ్రూప్‌-1 మెయిన్స్‌ రాతపరీక్షలకు కూడా అర్హత సాధించినట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అయితే ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంతో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తున్నట్టు వెల్ల డించింది. దీంతో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఈనెల 11న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ ద్వారా ఆదివారం నుంచి ఈనెల 11 వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశముందని పేర్కొన్నారు. అక్టోబర్‌ 16న నిర్వహించిన పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్‌ చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. కొత్త హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ముందుగానే వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, తర్వాత ఎక్కువ మంది అభ్యర్థులు ఒకేసారి తీసుకుంటే సాంకేతిక సమస్యలొస్తా యని తెలిపారు. హాల్‌టికెట్లలో ఉండే మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ఇతర వివరాలకు షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్ర దించాలని సూచించారు. అయితే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం టీఎస్‌పీఎస్సీలో పది పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇంకోవైపు టీఎస్‌పీఎస్సీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా బిఎం సంతోష్‌ను, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఎన్‌ జగదీశ్వర్‌ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Spread the love