ఎఫ్‌ఐఆర్‌ దాఖలుకు 14 రోజులు ఎందుకు పట్టింది?

Why did it take 14 days to file FIR?– మణిపూర్‌ ఘటనను ప్రత్యేక కోణంలో చూడాలి
– ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయనే సాకుతో సమర్ధించలేం : సుప్రీం వ్యాఖ్యలు
– లైంగిక వేధింపులపై దర్యాప్తునకు కమిటీ
”కేవలం సీబీఐ లేదా సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం)కు అప్పచెబితే సరిపోదు. సహాయ శిబిరంలో 19ఏళ్ళ యువతి తన కుటుంబాన్ని మొత్తం కోల్పోవడానికి దారి తీసిన పరిస్థితులను మనం పరిశీలించాల్సి వుంది. ఆమెను మేజిస్ట్రేట్‌ వద్దకు వెళ్ళమని చెప్పలేం. న్యాయ క్రమమే ఆమె ఇంటి ముంగిటకు వచ్చేలా మనం చూడాల్సి వుంది. మహిళా న్యాయమూర్తులు, పౌర సమాజ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తాం” అని న్యాయస్థానం పేర్కొంది.
న్యూఢిల్లీ : దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మహిళలపై నేరాలు జరుగుతున్నాయనే కారణంతో మణిపూర్‌లో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు, హింసను క్షమించలేమని, సమర్ధించలేమని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. మణిపూర్‌లో జరుగుతున్న జాతుల ఘర్షణ, హింస నేపథ్యంలో అక్కడి మహిళలపై అనూహ్యమైన రీతిలో లైంగిక హింస చోటు చేసుకుందని పేర్కొంది. మణిపూర్‌లో పరిస్థితులపై ఏం చర్యలు తీసుకున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ప్రశ్నలను గుప్పించింది. మే 4న సంఘటన జరిగితే 18న ఎఫ్‌ఐఆర్‌ నమోదైందనీ, అసలు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి 14రోజులు ఎందుకు పట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
”దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అనేక మంది మహిళలపై ఇటువంటి నేరాలు జరుగుతున్నాయనే సాకుతో మణిపూర్‌లో జరుగుతున్న దానిని మనం క్షమించి ఊరుకోలేం” అని త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు.
మణిపూర్‌లో పరిస్థితికి, ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులకు మధ్య తేడాను చంద్రచూడ్‌ వివరించారు. ”దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు జరుగుతున్నాయి. అందులో సందేహం లేదు. ఈనాటి మన సామాజిక వాస్తవికత ఇది. అయితే, మణిపూర్‌లో చోటు చేసుకున్నది గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగనిది, ప్రధానంగా మతోన్మాద, వేర్పాటువాద ఘర్షణలతో కూడిన పరిస్థితుల్లో జరిగిన హింసాకాండ ఇది. మిగిలిన వాటికి దీనికి తేడా అదే” అని చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా మహిళలపై నేరాలు జరుగుతున్నాయనే వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని అన్నారు. అయితే, మణిపూర్‌లో పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొనగలమనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్నగా వుందన్నారు.
బిజెపియేతర పాలిత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్‌, చత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌, కేరళల్లో ఇటువంటి నేరాల్లోని మహిళా బాధితులు న్యాయం కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నారని పేర్కొంటున్న పిటిషన్‌పై బెంచ్‌ విచారణ జరిపింది. ఆ పిటిషన్‌ తరుపున న్యాయవాది బన్సూరి స్వరాజ్‌ వాదనలు వినిపిస్తూ, మణిపూర్‌లో బాధిత మహిళలకు న్యాయం జరగడం కోసం సుప్రీం కోర్టు రూపొందించే ఏ యంత్రాంగమైనా అది సిబిఐ దర్యాప్తా లేక సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని దర్యాప్తులా అనే దానితో సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాల్లోని మహిళా బాధితులకు కూడా వర్తింపచేయాలని కోరారు. వారందరూ కూడా భరతమాత కుమార్తెలేనని వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి కూడా అంతే దారుణంగా వుందని స్వరాజ్‌ పేర్కొన్నారు. బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిపై అల్లరి మూక లైంగిక దాడులకు పాల్పడిందని, నగంగా ఊరేగించారని తెలిపారు. ఇంకా వెన్నులో వణుకు పుట్టించే వాస్తవాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయన్నారు. రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, చత్తీస్‌ఘడ్‌, కేరళ్లో కూడా ఇదే రీతిలో సంఘటనలు జరుగుతున్నందున, భరతమాత కుమార్తెలందరినీ ఈ న్యాయ స్థానం కాపాడాలి, కేవలం మణిపూర్‌కే ఈ యంత్రాంగం పరిమితం కాకూడదని స్వరాజ్‌ కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, దేశంలోని ఆడపిల్లలందరినీ రక్షించాలని అంటున్నారా లేక ఎవరినీ కాపాడవద్దని అంటున్నారా అని ప్రశ్నించారు. దానిపై స్వరాజ్‌ స్పందిస్తూ దేశంలోని ఆడపిల్లలందరి రక్షణకు చర్యలు తీసుకోవాలని వివరణ ఇచ్చారు.
కుకీ మహిళల తరపున దాఖలైన పిటిషన్‌పై వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ, ఇలాంటి కేసులు ఎన్ని నమోదయ్యాయని చెప్పడానికి ప్రభుత్వం వద్ద డేటా లేదన్నారు. ప్రభుత్వం స్థితిగతులు, వ్యవహారాలు ఆ రకంగా వున్నాయని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణతో కూడిన దర్యాప్తు చేపట్టాలని ఆయన అభ్యర్ధించారు.

Spread the love