సమస్యలెన్నో..

Many problems..– అంగవైకల్యంపై చిన్నచూపు?
– కార్పొరేషన్లో సిబ్బంది కొరత
– సంక్షేమం పట్టని సర్కారు

– ఎండమావిగా మారిన స్వయం ఉపాధి
– ఆందోళన కలిగిస్తున్న రోస్టర్‌..

చిన్నప్పటి నుంచే అంగవైకల్యంతో బాధపడుతున్నాను. ఊతకర్ర సహాయంతో పని చేసుకుంటున్నాను. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో మా వాటా మాకు కావాలని ఎన్నో సార్లు సర్కారు దృష్టికి తీసుకుపోయాము. అంగవైకల్యంతో పుట్టటం మా తప్పుకాదు.. మా బాధలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో ఉన్నాయి. ఏం చేయాలన్నా సకలాంగులు చేసినట్టు చేయలేం కదా? సానుభూతి ప్రకటించినంత మాత్రాన, దేవుడి బిడ్డలని ప్రభోదించినంత మాత్రాన సమస్యలు తీరవు. మరో పక్క మేమంటే ఈసడింపులు, తక్కువ చూపు, వివక్ష లేకపోలేదు. మూరెడు చేసి బారెడు చేసినట్టుగా ఏలికలు ప్రచారం చేసుకుం టున్నారు. చట్టం మాకు కొన్ని హక్కుల్ని కల్పించింది. వాటిని అమలు చేసినా చాలు, అప్పుడే.. మా కష్టం, బాధ అర్ధం చేసుకున్నట్టవుతది. మా లాంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుదే. రాజు మేడ్చెల్‌ జిల్లా.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇదొక రాజు బాదేకాదు సుమా.. రాష్ట్రంలో ఇలాంటి రాజులు ఎందరో.. వికలాంగులంటేనే సహకరించని శరీరాలు. ఏ పనిచేయాలన్నా కష్టమే. వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిత్యం ఏదో ఒక చోట నిర్లక్ష్యానికి గురవుతూనే ఉ న్నారు. వీరి అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన ప్రభుత్వం సైతం పట్టించుకోవటం లేదన్న ఆరోపణలున్నాయి.
పింఛన్లకు షరతుల అవస్థలు..
తెలంగాణ రాష్ట్రంలో 43.02 లక్షల మంది వికలాంగులున్నారు. వీరిలో 4.97 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు.ప్రతి నెల మొదటి వారంలో రావాల్సిన పింఛన్లు ఆలస్యం కావటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని సమయాల్లో నెలల తరబడి రాని పరిస్థితి కూడా ఉంది. దీంతో వారి జీవనం అస్తవ్యస్తంగా మారుతున్నది. మరో పక్క ఆసరా పెన్షన్ల మంజూరుకు ఆదాయ పరిమితి విధించే జీవో 17 వికలాంగులకు శాపంగా మారింది. 2014 లో ఈ జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. 2022 అక్టోబర్‌ నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందనే విమర్శలున్నాయి. దీంతో అర్హులైన వేలాది మంది వికలాంగుల పింఛన్లు రద్దయ్యాయి. వీటి మీదనే ఆధారపడిన వికలాంగులు వృద్ధులు, ఒంటరి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు ఆర్థిక సహాయం ద్వారా వారిని ఆదుకోవటమే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పుకుంటుంది. వారి ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచుతున్నామని ప్రకటించింది. మరోవైపు తప్పుడు జీవోలతో వారిని అవస్థల పాలు చేస్తుంది.
స్వయం ఉపాధి ఎండమావేనా..?
స్వయం ఉపాధి కోసం 2021లో వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం 829కి ఇచ్చేందుకు నిర్ణయించుకుంది. అందులోనూ..ఇచ్చింది 386 మందికి మాత్రమే..ఇదే తీరున తొమ్మిదేండ్ల కాలాన్ని గడుపుతూ వచ్చిందని వికలాంగుల సంఘాలు విమర్శిస్తున్నాయి. బ్యాంకు లింకేజి లేనటువంటి రూ.50వేల రుణాలను మాత్రమే పంపిణీ చేసి, బ్యాంకు లింక్‌ చేసినటువంటి రుణాలను మంజూరు చేయడం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రుణాల కోసం దరఖాస్తులను స్వీకరించటం లేదని లబ్దిదారులు వాపోతున్నారు. పరికరాల కోసం తెలంగాణ వికలాంగుల కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌లో 5వేల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు. పరికరాల కోసం క్యాంపులు నిర్వహించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.వాటి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలనే నిబంధన ఎందుకు పెట్టారని లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు.
పాలకులకు పట్టని సమస్యలు..
వికలాంగులపై వేధింపులు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని వారు ఎప్పటి నుంచో సర్కారు ముందు మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం భర్తీ చేస్తున్న అన్ని రకాల ఉద్యోగాల్లో నాలుగు శాతం వారికి కేటాయించాలని కోరుతున్నారు. వికలాంగుల హక్కుల చట్టం 2016, తెలంగాణ ప్రభుత్వం నియమాల ప్రకారం దళిత బంధు, గృహలక్ష్మి, డబుల్‌ బెడ్‌ రూమ్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటి, రూరల్‌, వ్యవసాయ, రైతు తదితర అన్ని పథకాల్లో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్‌ కల్పించాలి. 25శాతం ఆర్థిక లబ్దిని చేకూర్చాలి. కానీ ప్రభుత్వం ఆ పని చేయకుండా దాటవేస్తున్నది. చట్టం అమలు కానందున వారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
కార్పొరేషన్లో సిబ్బంది కొరత…
వికలాంగుల కార్పొరేషన్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయిన నాటి నుంచి ఖాళీలు భర్తీ కాలేదని తెలుస్తున్నది.ఇప్పటికే 20మందికి పైగా పదవీ విరమణ పొందారు. ఆ స్థానాలు అలానే మిగిలి ఉన్నాయి. ఉన్నవారిపై తీవ్ర పనిభారం పడుతున్నదని ఉద్యోగులు వాపోతున్నారు. కార్పొరేషన్‌ ద్వారా రెండు రకాల పనులు జరగాలి. పరికరాల ఉత్పత్తి, వికలాంగులకు శిక్షణ ఈ రెండు పనులు సంపూర్ణంగా జరిగితేనే వారికి తగిన సహకారం అందుతుంది. అందుకు తగిన సిబ్బంది. లేకపోవటంతో వికలాంగుల కార్పొరేషన్‌ నిర్వీర్యంగా మారింది. ఉదాహరణకు రాష్ట్రంలో శిక్షణ, ఉత్పత్తికి చెందిన సుమారు 16 సెంటర్లుంటే. అందులో హైదరాబాద్‌, రంగారెడ్డి సెంటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. సూర్యాపేట, సదాశివపేట, నిజామాబాద్‌ సెంటర్లు పనిలో లేవు. కోటి ఈఎన్‌టీ ఆస్పత్రిలో హియరింగ్‌ మోల్డ్‌ సెంటరు గతంలో ఉండేది. కానీ ప్రస్తుతం అది మూత పడింది. ఇలా ఆయా సెంటర్లలో ఉన్న కేంద్రాలు మూతపడ్డాయి. సౌండ్‌ లైబ్రరీలో 30 మంది పనిచేయాల్సిన చోట ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు. మలక్‌ పేటలో ఉన్న బ్రెయిలీ ప్రెస్‌లో 30 మంది సిబ్బందికిగానూ, ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తున్నారు. 1981లో వికలాంగుల కార్పొరేషన్‌ ఏర్పడింది. 1983లో వికలాంగుల సంక్షేమ శాఖ ఏర్పడింది. ప్రస్తుతం 33 జిల్లాల్లో కార్యాలయాలున్నప్పటికీ వాటి ద్వారా వారికి అవసరమైన పరికరాలు, ఇతర సంక్షేమ పథకాల అమలు జరగటం లేదు. రాష్ట్రంలో ఏడు రకాల వైకల్యం కలిగిన వారిని లెక్కిస్తేనే 10,46,820 మంది వికలాంగులున్నారు. వాస్తవంగా 21 రకాల వైకల్యం కలిగిన వారిని లెక్కిస్తే సుమారు 20లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. వీరి సంక్షేమం, అవసరాల ఆధారంగా కేటాయింపులు లేవు. ప్రతి బడ్జెట్లో నిధులు పెంచినట్టు అంకెల్లో చూపుతున్నప్పటికీ ఖర్చు చేయటం లేదు.
సర్కారువి కంటి తుడుపు చర్యలే..
ప్రభుత్వ విధానాల వల్ల రోజురోజుకు ధరలు పెరుగుతు న్నాయి. అందుకు తగిన ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు కంటి తుడుపు చర్యలు వికలాంగులను ఆదుకోలేక పోతున్నాయి. క్రమంగా కార్పొరేషన్‌ ను నిర్వీర్యం చేస్తున్నది. ఖాళీలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్నది. అంధులు బధిరుల కోసం ఉన్న శిక్షణా కేంద్రాలు కూడా మూసివేత దశలో ఉన్నాయంటే వికలాంగుల పట్ల ప్రభుత్వ చిత్త శుద్ధి ఏపాటిదో అర్ధమవుతున్నది. ఇప్పటికైనా దరఖాస్తు చేసుకున్న ప్రతి వికలాంగుడికి పరికరాలు పంపిణీ చేయాలి. నిరుద్యోగ వికలాంగుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో వసతితో పాటు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
ఎం అడివయ్య – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జాతీయ వికలాంగుల హక్కుల వేదిక(ఎన్‌పీఆర్‌డీ)

Spread the love