ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం..

– అసెంబ్లీలో బిల్లు
– కార్మికులు, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు సబ్‌ కమిటీ
– పంట నష్టంపై సమగ్ర నివేదికకు ఆదేశాలు
– తక్షణ వరద సాయం రూ.500 కోట్లు
– వరద సాయం కోసం రూ.500 కోట్లు విడుదల
– ఖమ్మం నగరానికి అనుకుని ఉన్న మున్నేరు నది వెంట ఫ్లడ్‌ బ్యాంక్‌ నిర్మాణానికి ఆమోదం… నివేదిక తయారు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు
– రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచాలంటూ వ్యవసాయశాఖకు ఆదేశాలు
– ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన కమిటీలో రవాణా, సాధారణ పరిపాలన, కార్మికశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.
– మహబూబాబాద్‌ జిల్లాకు హార్టికల్చర్‌ కళాశాల
– బీడీ టేకేదార్లకు పెన్షన్‌
– వరంగల్‌ ఎయిర్‌ పోర్టుకు 200 ఎకరాలు
– సౌత్‌ ఇండియా సెంటర్‌ ఫర్‌ కాపు కమ్యూనిటీ ఏర్పాటుకు హైదరాబాద్‌లో స్థలం
– మరో 8 వైద్యకళాశాలలకు ఆమోదం
– వరదల్లో మరణించిన వారికి క్యాబినెట్‌ నివాళి
– రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం అందుకనుగుణంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది. తద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనీ, దాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేసేందుకు నిర్ణయించింది. ఆ సంస్థలోని 43,373 మంది ఉద్యోగులు, కార్మికులు, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. సంబంధిత విధివిధానాలను రూపొందించేందుకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన సబ్‌ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. సంబంధిత బిల్లును గురువారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాల్లో ప్రవేశపెడతామని వివరించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. రాత్రి 7.30 గంటల వరకు క్యాబినెట్‌ కొనసాగింది. అందులో తీసుకున్న నిర్ణయాలను కేటీఆర్‌ మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలో జులై 18 నుంచి 28 వరకు పెద్ద ఎత్తున కురిసిన వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైందనీ, వాటి వల్ల జరిగిన నష్టంపై అన్ని శాఖలతో మంత్రివర్గం చర్చించి సమగ్ర సమాచారం సేకరించేందుకు ప్రయత్నించిందని ఆయన తెలిపారు. భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, కొత్తగూడెం తదితర 10 జిల్లాల్లో ఎక్కువగా నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ నేపథ్యంలో వరద సాయం కింద రూ.500 కోట్లు తక్షణం విడుదల చేయాలనీ, వాటితో తాత్కాలిక, తక్షణ మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు చేపట్టనున్నామని వెల్ల డించారు. ఇప్పటికే తరలించిన 27 వేల మందికి తిరిగి పునరావాసం కల్పించ నున్నట్టు వివరించారు. 40 మంది విద్యార్థులను కాపాడిన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయునితో పాటు ఇద్దరు విద్యుత్‌ ఉద్యోగులను పంద్రాగస్టున సత్కరించ నున్నట్టు తెలిపారు. ఖమ్మం పట్టణం చుట్టూ ఉన్న మున్నేరు వాగు వెంట సురక్షితమైన గోడను నిర్మిస్తామన్నారు. వర్షాలతో చెరువులు నిండుకుండల్లా ఉన్నా యని తెలిపారు. విత్తనాలు, ఎరువులతో రైతులకు సహాయం చేయాలని వ్యవ సాయ శాఖను కోరినట్టు తెలిపారు. వరదలతో మరణించిన 40 మందికి ఎక్స్‌ గ్రేషియా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. పొలాల్లో ఇసుక మేటలు, ఇతర నష్టాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు తెలిపారు.
విశ్వనగరమైన హైదరాబాద్‌లో మౌలిక వసతులు కూడా అదే స్థాయిలో ఉండేలా ప్రజా రవాణా వ్యవస్థను విస్తతం చేయనున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. నగరానికి పలు వైపులా రూ.60 వేల కోట్లతో మెట్రోను మూడు నుంచి నాలుగేండ్ల కాలంలో విస్తరించనున్నట్టు చెప్పారు. పాతనగరం మెట్రోను కూడా పూర్తి చేస్తామన్నారు. అనాథ పిల్లల ఆలనా-పాలనా బాధ్యత ప్రభుత్వానిదేననీ, దానికి తగినట్టు అనాథల పాలసీని వచ్చే క్యాబినెట్‌లో ఆమోదించేలా నివేదిక రూపొందించాలని మహిళా, శిశు సంక్షేమశాఖను ఆదేశించినట్టు తెలిపారు.
గవర్నర్‌ కోటాలో ఇద్దరికి ఎమ్మెల్సీ
ఎస్టీల్లో ఎరుకుల సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణతో పాటు వెనుకబడిన తరగతులకు చెందిన దాసోజు శ్రవణ్‌కు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తూ కేబినెట్‌ ఆమోదించింది. దాదాపు 50 అంశాలపై మంత్రివర్గంలో చర్చించినట్టు కేటీఆర్‌ తెలిపారు. నగరంలో నాలుగు టిమ్స్‌ ఆస్పత్రులను సగం నిమ్స్‌, సగం ఉస్మానియా తరహాలో నడపాలని నిర్ణయించినట్టు చెప్పారు. వీటితో పాటు రెండు వేల పడకలతో నిమ్స్‌ విస్తరణకు నిధుల సేకరణకు ఒకే చెప్పామని తెలిపారు. వరంగల్‌లో మామునూరులో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూమి ఇచ్చేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. పుణె, గోవా పట్టణాల్లో రక్షణశాఖ విమానాశ్రయాలను పౌరుల సేవలకు కూడా ఉపయోగించుకుంటున్నట్టుగానే హకీంపేట విమానాశ్రయాన్ని ఉపయోగించుకునేలా అనుమతించాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రివర్గంలో తీర్మానించినట్టు తెలిపారు.
కేంద్రం సహకరించకుంటే ….సొంతంగానే
హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వరదల సమయాల్లో కేంద్రం ఒక్క పైసా సాయం చేసిన పాపాన పోలేదనీ, ఈసారైనా రాజకీయం చేయకుండా సహకరించాలని కోరారు. మెట్రోకు కేంద్రం సహకరించకుంటే రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మిస్తుందని స్పష్టం చేశారు. నిధులకు సంబంధించి కేంద్రానికి చెప్పినా..గోడకు చెప్పినా ఒక్కటే అనే పరిస్థితి ఉందనీ, అయినా సరే..హస్తినకు పోయి రావలే అన్నట్టు తమ వంతు ప్రయత్నం తాము చేస్తామని తెలిపారు. గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని కేంద్రం రాజకీయం చేస్తోందని విమర్శిచారు. ఇప్పటికే శాసనసభ ఆమోదించిన పురపాలక, గ్రామపంచాయతీ, విద్యాశాఖలకు చెందిన మూడు బిల్లులను అసెంబ్లీ సమావేశారల్లో మరోసారి తీర్మానించి పంపిస్తామని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ రెండో సారి తీర్మానించిన బిల్లులను గవర్నర్‌ ఎవ్వరున్నా… ఏ రాజకీయ అభిప్రాయంతో ఉన్నా సరే ఆమోదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మంత్రులు పువ్వాడ అజరు, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు.
రూ.60 వేల కోట్లతో నాలుగేండ్లలో మెట్రో పూర్తి
– రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శరవేగంగా పెరుగుతున్న హైదరాబాద్‌ నగర జనాభాను, ఆ జనాభా అవస రాలకనుగుణంగా మెట్రో రైలు ప్రాజెక్టును మరింతగా విస్తరించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. మొత్తం రూ.60 వేల కోట్లతో వచ్చే నాలుగేండ్లలో దాన్ని పూర్తి చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. రాయదుర్గం-శంషాబాద్‌ విమానా శ్రయం మార్గంతో పాటుగా జేబీఎస్‌ నుంచి తూంకుంట వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రోను ఏర్పాటు చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. దీనితో పాటు సికింద్రా బాద్‌ ప్యాట్నీ సెంటర్‌ నుంచి కండ్లకోయ వరకు కూడా డబుల్‌ డెక్కర్‌ మెట్రోను ఏర్పాటు చేయనున్నారు. ఇస్నాపూర్‌-మియాపూర్‌, మియాపూర్‌-లక్డీకాపూల్‌ (మరో మార్గంలో), ఎల్‌.బీ.నగర్‌ – పెద్ద అంబర్‌పేట్‌, తార్నాక – బీబీనగర్‌, కండ్లకోయ-షాద్‌నగర్‌, శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు – కందుకూరు, ఉప్పల్‌ – ఈసీఐఎల్‌ వరకు మెట్రోను విస్తరించనున్నారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ కూడా మెట్రోను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్‌ మీడియాకు వెల్లడించారు.

Spread the love