మరో రైతాంగ ఉద్యమానికి సిద్ధం కావాలి

– రాత పూర్వక హామీల అమలుకై దశలవారీ ఆందోళనలు
– కార్పొరేట్‌ వ్యవసాయం కోసం మోడీ సర్కారు యత్నం
–  వ్యవసాయాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని గద్దెదించాల్సిందే…

– ఆయా రాష్ట్రాల్లో పటిష్టమైన ఉద్యమ కార్యాచరణ చేపట్టాలి
– ఎస్‌కేఎం రాష్ట్ర సదస్సులో వక్తలు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వ్యవసాయాన్ని కాపాడుకుంటూనే, అన్నదాతల హక్కుల కోసం ఢిల్లీ రైతాంగ పోరాట తరహాలో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సంయుక్త కిసార్‌ మోర్చా (ఎస్‌కేఎం) రాష్ట్ర సదస్సులో వక్తలు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను ఏడాదిన్నర గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. అవిశ్రాంత పోరాటంతో మోడీ సర్కారు మెడలు వంచి మూడు నల్ల చట్టాలను రద్దు చేయించిందని గుర్తు చేశారు. ఆ సందర్భంగా ప్రధాని రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీల అమలు కోసం సుదీర్ఘ పోరాటం చేయాల్సిన అవసరముందని తెలిపారు. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు పరోక్షంగా మోడీ ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడం ద్వారానే రైతులకు, వ్యవసాయానికి రక్షణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. రైతులకు మోడీ ఇచ్చిన హామీలేంటి? మద్దతు ధరలు, విద్యుత్‌ సవరణలు, రుణవిమోచన చట్టాలను, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అమలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌కేఎం తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. దీనికి ఎస్‌కేఎం రాష్ట్ర కన్వీనర్లు టి. సాగర్‌, పశ్యపద్మ, వి ప్రభాకర్‌, మండల వెంకన్న, భిక్షపతి, జక్కుల వెంకటయ్య, కన్నెగంటి రవి, వసుకుల మట్టయ్య, నాగిరెడ్డి, ప్రమీల, పి రామకృష్ణ, గొనె కుమరస్వామి, తుకరామ్‌నాయక్‌, ఎన్‌ బాలమల్లేష్‌, వెంకట్రాములు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. అనంతరం పలువురు ఎస్‌కేఎం జాతీయ నాయకులు మాట్లాడారు. జాతీయ స్థాయిలో మరో రైతాంగ ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముందని సదస్సులో ఎస్‌కేఎం జాతీయ నాయకులు హన్నన్‌మొల్లా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ర్యాలీలు, ధర్నాలు, రాజ్‌భవన్‌ ముట్టడి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అందుకనుగుణంగా రైతు ఉద్యమ కార్యచరణను రూపొందించాలని సూచించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి గొప్ప పేరుందన్నారు. ఆ స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పారు. అదే స్పూర్తితో మూడు వ్యవసాయ సాగు చట్టాలను తిప్పికొట్టిందని గుర్తు చేశారు. సుదీర్ఘ పోరాట ఫలితంగానే మోడీ ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటన్నారని తెలిపారు. ఆ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. అందు కోసం మరో ఉద్యమాన్ని నిర్వహించాలన్నారు. రావుల వెంకయ్య మాట్లాడుతూ రైతులు ఐక్యం కాబోరు. వారు విప్లవవర్గం కాదనే అభిప్రాయాలను ఢిల్లీ రైతాంగ ఉద్యమం పటాపంచలు చేసిందని తెలిపారు. మోడీ పాలిట ఆ ఉద్యమం సింహస్వప్నమైందని చెప్పారు. అందుకే బేేషరతుగా సాగు చట్టాలను రద్దు చేశారని గుర్తు చేశారు. రమిందర్‌ సింగ్‌ పాటియా మాట్లాడుతూ సోకాల్డ్‌ నేషనలిస్టులు రైతుల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైందని చెప్పారు. ఆహార భద్రతను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలపై ఢిల్లీలో మహాపడావ్‌ నిర్వహిస్తామన్నారు. వడ్డే శోభనాదీశ్వరరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించితేనే రైతులకు రక్షణ ఉంటుందని చెప్పారు. అందుకు ఊరూరా ప్రచారం నిర్వహించాలని కోరారు. రావుల చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన చర్యల ద్వారా రైతులను నట్టేట ముంచుతున్నదని తెలిపారు. విస్సా కిరణ్‌ మాట్లాడుతూ రైతులను కేంద్ర దగా చేస్తున్నదని విమర్శించారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఎం జాతీయ నేతలు చిట్టిపాటి వెంకటేశ్వరరావు, వేములపల్లి వెంకట్రామయ్య, గిరీష్‌కుమార్‌, గాదరిగోని రవి, ప్రసాద్‌, నారాయణరావు, భాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్‌, కార్మిక నేతలు బాలరాజ్‌, సూర్యం, నాగిరెడ్డి తదితరులు మాట్లాడారు.
తీర్మానం
‘2020-21లో జరిగిన చారిత్రాత్మక ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేసి తక్కిన డిమాండ్లను కూడా సాధించుకోవాలి, మోడీ సర్కారు రైతులకు, కూలీలకు, ఆదివాసీలకు, శ్రామికవర్గాలకు చేస్తున్న దగాను బహిర్గతం చేయాలి. కార్పొరేట్లకు దేశాన్ని కట్టబెట్టే విధానాలపై రాష్ట్ర నలుమూల ప్రచారం నిర్వహించాలి’
ఉద్యమ కార్యచరణ ఇలా…
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రాన్ని,రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే నినాదంతో కార్యక్రమాలు
నెలాఖరులోగా అన్ని జిల్లాల్లో జిల్లా సదస్సులు, కమిటీల ఏర్పాటు
సెప్టెబర్‌, అక్టోబర్‌ నెలల్లో అన్ని జిల్లాల్లో పాదయాత్రలు, వాహన యాత్రలు
నవంబరు 26, 27,28 తేదీల్లో వేలాది మంది రైతులతో హైదరాబాద్‌లో మహాధర్నా

Spread the love