భూమి కౌలుకు ఇవ్వలేదని యువకుని హత్య

– కత్తితో పొడిచిన గ్రామస్తుడు
నవతెలంగాణ-తాంసి
ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలోని అర్లి(టి) గ్రామంలో దారుణ ఘటన జరిగింది. వ్యవసాయ భూమి తనకు కౌలుకు ఇవ్వలేదని యువకుడిని హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్లి(టి) గ్రామంలోని శాంతినగర్‌ కాలనీలో నివాసముంటున్న ఆత్రం అంకుష్‌(24)కు వ్యవసాయ భూమి ఉంది. దాన్ని ఓ వ్యక్తికి కౌలుకు ఇచ్చాడు. అయితే, తనకు కౌలుకు ఇవ్వలేదన్న కోపంతో అదే గ్రామానికి చెందిన కుమ్ర భీంరావ్‌ మంగళవారం రాత్రి అంకుష్‌తో గొడవ పడ్డాడు. తనకు కాకుండా మరొకరికి ఎలా ఇస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాటా మాటా పెరగడంతో భీంరావ్‌ అంకుష్‌ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని రిమ్స్‌కు తరలించగా.. బుధవారం మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఎస్‌ఐ రాధిక సంఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామ నిర్వహించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు నిందుతునిపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love