సీఎం కేసీఆర్‌తో అఖిలేశ్‌ భేటీ..

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ భేటీలో పలు కీలకాంశాలు చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల బీహార్‌ రాజధాని పాట్నాలో నిర్వహించిన జాతీయ స్థాయి ప్రతిపక్షాల సమావేశానికి బీఆర్‌ఎస్‌ను ఆహ్వానించలేదు. బీజేపీకి ఆ పార్టీ దగ్గరగా ఉన్నందునే దాన్ని ఆహ్వానించలేదనే వార్తలొచ్చాయి. ఆ భేటీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌తోపాటు అఖిలేశ్‌ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా బీఆర్‌ఎస్‌తో మాట్లాడేందుకు రాహుల్‌ గాంధీయే.. అఖిలేశ్‌ను కేసీఆర్‌ వద్దకు రాయబారిగా పంపారనే చర్చ నడుస్తోంది. మరోవైపు తాజాగా మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చిన తరహాలోనే కొద్ది రోజుల్లోనే యూపీలోని సమాజ్‌వాదీ పార్టీని చీల్చేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసిందనే వార్తలు కూడా వినబడుతున్నాయి. ఈ క్రమంలో పార్టీని కాపాడుకునేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై కేసీఆర్‌ నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకే అఖిలేశ్‌… ప్రగతి భవన్‌లో అడుగుపెట్టారనే చర్చ కూడా కొనసాగుతోంది. వీటితోపాటు హైదరాబాద్‌లో ఉన్న తన వ్యాపార లావాదేవీలను చక్కబెట్టుకునేందుకే సమాజ్‌వాదీ అధ్యక్షుడు హైదరాబాద్‌లో కాలుమోపారనే గుసగుసలు కూడా వినబడుతున్నాయి. ప్రగతి భవన్‌కు విచ్చేసిన అఖిలేశ్‌కు సీఎం కేసీఆర్‌ స్వాగతం పలికారు. భేటీలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, సీనియర్‌ నేత సముద్రాల వేణుగోపాలాచారి కూడా పాల్గొన్నారు.

Spread the love