కేరళ కాదు..కేరళం

Not Kerala..Kerala– కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం..
– పేరు ఎందుకు మార్చాలో చెప్పిన సీఎం పినరయి విజయన్‌
తిరువనంతపురం: కేరళ పేరును ‘కేరళం’ గా మార్చాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సభలో ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానానికి సభలోని అన్ని పక్షాల నాయకులు ఏకగ్రీవంగా, ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్రం అధికారిక పేరును అన్ని భాషల్లో ‘కేరళం’గా మార్చాలని సీఎం కేంద్రాన్ని కోరారు. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతూ. రాష్ట్రం పేరును మార్చాలని ఎందుకు కోరుతున్నామో సీఎం వివరించారు. ‘మలయాళంలో రాష్ట్రం పేరును ‘కేరళం’ అని పిలిచేవారు. కానీ, ఇతర భాషల్లో మాత్రం కేరళ అని పిలుస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటం కాలం నుంచి మలయాళం మాట్లాడే వర్గాల కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ బలంగా ఉంది. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌ లో మన రాష్ట్రం పేరును కేరళ అని రాసి ఉంది. అందువల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం దీన్ని ‘కేరళం’గా సవరించి, రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌ లో పేర్కొన్న అన్ని భాషల్లో ‘కేరళం’గా పేరు మార్చడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం’ అని పినరయి విజయన్‌ వివరించారు.

Spread the love