కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై..ఐక్యంగా పోరాడుదాం

– లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌
– క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ‘క్విట్‌ మోడీ’ కార్యక్రమం
నవతెలంగాణ- విలేకరులు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌ పిలుపు నిచ్చారు. బుధవారం క్విట్‌ఇండియా దినోత్సవం సందర్భంగా ఆ ఉద్యమ స్ఫూర్తితో బీజేపీ నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు జాతీయ కార్మిక, ఉద్యోగ సంఘాలు 9,10 తేదీల్లో మహా పడావ్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు.
సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో చుక్క రాములు పాల్గొని మాట్లాడారు. తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో కార్మికులు, ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చి పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. వేతనాల కోడ్‌తో కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి మంగళం పాడారని, పారిశ్రామిక సంబంధాల కోడ్‌ చట్టంతో సమ్మె హక్కును కాలరాశారని, సామాజిక భద్రతా కోడ్‌, వృత్తి సంబంధిత రక్షణ, ఆరోగ్యం-పని పరిస్థితుల కోడ్‌లతో పీఎఫ్‌, ఈఎస్‌ఐ, వెల్ఫేర్‌ బోర్డులపై గొడ్డలి వేటు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో వంద శాతం వాటాలను కారు చౌకగా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో పక్క పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెరుగుదలతో నిత్యవసరాల ధరల్ని పెరిగి ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. మతం, కులం, భాష, ప్రాంతం పేరిట భావోద్వేషాలను రెచ్చగొడుతూ.. దేశ స్వావలంబనకే ముప్పు వాటిల్లేలా పరిపాలన చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా సమరశీలంగా పోరాడాలన్నారు.
ఖమ్మం ధర్నా చౌక్‌లోని పాత కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. మోడీ పాలనలో స్వదేశీ, విదేశీ పారిశ్రామికవేత్తల ఆర్థిక ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, 4 లేబర్‌ కోడ్‌లను తెచ్చారని, 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పొడిగించి పని భారం పెంచారని విమర్శించారు. యూనియన్లు పెట్టుకునే హక్కును నిరాకరిస్తున్నారని, కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనాలివ్వాలన్న చట్టబద్ధ ఆదేశాలను, న్యాయస్థానాల తీర్పులను బుట్టదాఖలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమం, సాంఘిక భద్రత, ఉపాధి, ఉద్యోగ రక్షణ లేకుండా పోతున్నదన్నారు. దాంతో ఆర్థిక అసమానతలు తీవ్రమౌతున్నాయని, ఆర్థిక మాంద్యం మరింత ఉధృతం అవుతుందని, ఉపాధి కల్పన స్తంభించి నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌ సంస్థల అనుకూల విధానాల వల్ల కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయని తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఐక్య సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన మహా పడావ్‌ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతోందని విమర్శించారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, క్విట్‌ ఇండియా ఉద్యమస్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందామన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేశారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలో బస్టాండ్‌ వద్ద ఆల్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ‘క్విట్‌ మోడీ.. సేవ్‌ ఇండియా’ అంటూ నినాదాలు చేశారు.

Spread the love