– ముడిసరుకు ధర తగ్గినా..తగ్గించని కేంద్రం
– సబ్సిడీల్లో భారీగా కోత
– ధరలు మాత్రం యథాతథం
– ఆవేదన చెందుతున్న రైతాంగం
కేంద్రం రైతులపై లేని ప్రేమను ఒలకబోస్తూ తనదైన రీతిలో దగా చేస్తోంది. ఎరువుల ధరలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. అంతర్జాతీయంగా ఎరువుల ముడిసరుకు ధరలు తగ్గితే రైతులకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించుకుంది కానీ ఎరువుల ధరలు ఏమాత్రం తగ్గించలేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో రైతులు పంట చేలలో కలుపు తొలగించి.. వివిధ రకాల ఎరువులు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
దుకాణాల వద్దకు వెళ్లి ఫెర్టిలైజర్ రేట్లు చూసి అవాక్కవుతున్నారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రం బడ్జెట్‌లో 2022-23లో ఎరువులపై సబ్సిడీ రూ.2.54 లక్షల కోట్లు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరం 22.25% కోత పెట్టి రూ.1.75 లక్షల కోట్లకు తగ్గించింది.
సేంద్రీయ సాగును ప్రోత్సహించే పేరుతో ‘పీఎం ప్రణామ్’ పథకాన్ని తీసుకొచ్చి సబ్సిడీకి ఎగనామం పెట్టేందుకు ప్రయత్నిస్తోందని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి.
యూరియా, డీఏపీ సబ్సిడీల్లో కోత..
రైతులు ఎక్కువగా వినియోగించే యూరియా, డీఏపీ వంటి ఎరువులకు గతంలో ఇచ్చిన సబ్సిడీతో పోలిస్తే ఈసారి కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. యూరియాకు రూ.78వేల కోట్లు, డీఏపీకి రూ.38వేల కోట్లతో సరిపెడుతోంది. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు తగ్గడంతో సబ్సిడీ మొత్తాన్ని తగ్గించినట్టు కేంద్రం చెప్పుకొస్తోంది. కానీ అంతర్జాతీయ ధరల క్షీణతకు అనుగుణంగా దేశీయంగా ఎరువుల ధరలను మాత్రం సవరించకపోవడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్‌లో తక్కువ ధరకు ఎరువులు లభిస్తున్నా.. అన్నదాతకు ఆ ప్రయోజనం దక్కకుండా మోడీ సర్కారు మోకాలడ్డుతోంది.
గ్లోబల్ మార్కెట్ ధరలు ఇండియన్ మార్కెట్‌కు వర్తించవా..?
అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగితే ఆ పేరుతో దేశీయంగా ధరలు పెంచే కేంద్ర ప్రభుత్వం తగ్గినప్పుడు మాత్రం ఆ మేరకు సవరించట్లేదని స్పష్టమవుతోంది. అమ్మోనియా, ఫాస్ఫరిక్ యాసిడ్‌తోపాటు ఎంవోపీ, డీఏపీ, 10:26:26, 28:28:0, కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ ధరలు గ్లోబల్ మార్కెట్లో జనవరి-ఫిబ్రవరి నుంచి క్రమేణా క్షీణిస్తున్నాయి. ఫిబ్రవరిలో 12 శాతం ఉన్న తగ్గుదల ఏప్రిల్ నాటికి 40శాతానికి చేరింది. ఈ ధరలను ఆధారం చేసుకుని సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం తగ్గించింది. కానీ ఎరువుత ధరలను మాత్రం సవరించలేదు. దీనివల్ల ఇటు రైతులు, కంపెనీలకు ప్రయోజనం దక్కకపోవడంతో దేశీయంగా ఎరువుల ధరల్లో వ్యత్యాసం లేదని ఎరువుల హోల్‌సేల్ అండ్ రిటైల్ వర్తకుల అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పుల్లఖండం నాగేందర్‌రావు తెలిపారు.
ముడిసరుకు ధర క్షీణత
అంతర్జాతీయంగా ఎరువుల ముడిసరుకు ధరలు క్షీణిస్తున్నాయి. అమ్మోనియా జనవరిలో మెట్రిక్ టన్ను ధర డాలర్లలో 830 ఉంటే ఏప్రిల్ నాటికి 250కి పడిపోయింది. ఫాస్ఫరిక్ యాసిడ్ రేటు 1150 డాలర్ల నుంచి వెయ్యికి తగ్గింది. యూరియా 580 నుంచి 290 డాలర్లకు పడిపోయింది. తదనుగుణంగా ఎరువుల ధరలు తగ్గాలి కానీ పెంచిన రేట్లు అలానే ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఎరువుల ముడిసరుకు రేట్లు తగ్గినా ధరల్లో ఎలాంటి మార్పుల్లేవు. పొటాష్ ముడిసరుకు రేటు తగ్గినా.. సబ్సిడీ పెంచలేదు. మెట్రిక్ టన్ను యూరియాపై సబ్సిడీ రూ.45వేల నుంచి 19వేలకు తగ్గించింది. కానీ ధరల్లో మాత్రం వ్యత్యాసం లేదు. గతేడాది నానో యూరియాను వెలుగులోకి తెచ్చిన కేంద్రం ఈ సంవత్సరం నానో డీఏపీని ప్రవేశపెట్టి సబ్సిడీ భారం నుంచి ఉపశమనం పొందుతోంది. ఈ నానో డీఏపీ లీటర్ బాటిల్ ధర రూ.600గా నిర్దేశించింది. కేంద్రానికి సబ్సిడీ సొమ్ము భారీగా మిగులుతోంది. నానో యూరియా, డీఏపీలను పురుగుమందుల తరహాలో ఆకులపై పిచికారీ చేస్తే సరిపోతుంది. ‘పీఎం ప్రణామ్’ పథకాన్ని ప్రోత్సహించడానికి సబ్సిడీని ఏటికేడు క్రమంగా ఎత్తివేస్తోంది.
నానో ఎరువైనా ధరల్లో వ్యత్యాసం స్వల్పమే..!
ద్రవరూపంలో ఉండే నానో యూరియా, నానో డీఏపీ అందుబాటులోకి వచ్చినా ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. 50 కేజీల బస్తాను అర లీటర్ నానో ఎరువుగా తయారు చేశారు. యూరియా బస్తా రూ.268 ఉండగా నానో యూరియా బాటిల్ రూ.240కి లభిస్తుంది. దీనివల్ల యూరియా సబ్సిడీని కేంద్రం తప్పించుకుంది. నానో ఎరువులతో అధిక ప్రయోజనాలున్నాయని ప్రభుత్వం చెబుతున్నా.. రైతులు మాత్రం వీటిపై ఆసక్తి చూపడం లేదు.
సబ్సిడీ తప్పించుకునే యత్నం
ఘనంగా ‘వన్ నేషన్.. వన్ ఫర్టిలైజర్’ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ‘భారత్ బ్రాండ్’ అనే పేరుతో కంపెనీతో నిమిత్తం లేకుండా ఎరువును తీసుకొచ్చింది. మ్యాన్‌ఫ్యాక్చర్ పేరుతో కంపెనీ పేరు కొద్దిపాటి లెటర్స్‌లో ఉంటుంది తప్ప గతంలో లాగా బోల్డ్ లెటర్లు కనిపించవు. ఇవన్నీ బాగుగా అనిపించినా ఆచరణలో మాత్రం ఎరువుల సబ్సిడీ భారం నుంచి తప్పించుకునే ప్రయత్నాలే.
పుల్లఖండం నాగేందర్‌రావు, ఎరువులు, విత్తన డీలర్ల అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు