– పధాన పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు
– బీఆర్‌ఎస్‌లో మెజారిటీ సీట్లలో సిట్టింగ్‌లకే పెద్దపీట..!
– కాంగ్రెస్‌లో ఒక్కోచోట రెండు నుంచి పదిమంది ఆశావహులు
– అత్యంత కీలకంగా కమ్యూనిస్టులు
– ఏడు స్థానాలపై కేంద్రీకరణ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. బీఆర్‌ఎస్ గతం కంటే మెరుగైనా… పొంగులేటి పార్టీ వీడిన నేపథ్యంలో కమ్యూనిస్టుల బలం తోడైతేనే ‘కారు’ ముందుకు సాగే పరిస్థితి ఉందని విశ్లేషకుల అంచనా. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్కొక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో మెరుగైన ఫలితాల సాధనకు ఏ పార్టీకైనా కమ్యూనిస్టుల ప్రస్తావన లేకుండా ముందుకు అడుగు వేయలేని పరిస్థితి అనివార్యంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆవిర్భావం తర్వాత వచ్చిన రెండు అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. ఈసారి ఎన్నికల్లోనూ కమ్యూనిస్టుల బలం ఎవరివైపు ఉంటే వారికి విజయం కచ్చితంగా ఉంటుంది. సీపీఐ(ఎం), సీపీఐ కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు కేంద్రీకరించి పని చేస్తున్నాయి. పొత్తులు ఖరారైతే అవగాహనను బట్టి సంఖ్య మారే అవకాశం ఉంది.
పొత్తు ఖరారైతే ఒకలా.. కాకుంటే మరోలా!
ఒకటి, రెండు నియోజకవర్గాలు తప్ప మిగిలిన చోట్ల సిట్టింగ్‌లకే బీఆర్‌ఎస్ పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమ్యూనిస్టులతో ఎన్నికల పొత్తులు ఖరారైతే ఆ పార్టీ అభ్యర్థుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన నలుగురు (కందాల ఉపేందర్‌రెడ్డి(పాలేరు), హరిప్రియ (ఇల్లెందు), రేగా కాంతారావు (పినపాక), వనమా వెంకటేశ్వర్లు (కొత్తగూడెం)), టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు (సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వరరావు (అశ్వారావుపేట)) ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. పాలేరు టిక్కెట్ విషయంలో సందిగ్దం నెలకొంది. వైరాలో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన రాములునాయక్, మాజీ ఎమ్మెల్యేలు బాణోత్ మదన్‌లాల్, చంద్రావతి, లకావత్ గిరిబాబు బీఆర్‌ఎస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. భద్రాద్రి జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య కాంగ్రెస్‌లో చేరికతో ఇల్లెందు బీఆర్‌ఎస్ టిక్కెట్ హరిప్రియకు ఖాయమైనట్టేనని ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెంలో వనమాకు పోటీగా గడల శ్రీనివాసరావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్లు వినిపిస్తున్నా.. ఇంకా ఎవరనేది తెలియదు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉన్న జలగం వెంకట్రావు వేచిచూస్తున్నారు. భద్రాచలం నుంచి చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, 2014లో టీఆర్‌ఎస్ అభ్యర్థి మానె రామకృష్ణ, చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు బీఆర్‌ఎస్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. మధిర నుంచి జడ్పీచైర్మన్ లింగాల కమలరాజ్, బమ్మెర రామ్మూర్తి మధ్య పోటీ నెలకొంది. ఖమ్మంలో పువ్వాడ అజరుకుమార్, సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య, పినపాక నుంచి రేగా కాంతారావు, అశ్వారావుపేట మెచ్చా నాగేశ్వరరావులకు టిక్కెట్ విషయంలో పోటీ ఉండకపోవచ్చు.
కాంగ్రెస్‌కు కొత్త, పాత చిక్కులు…
సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, కేంద్రమాజీ మంత్రి రేణుకాచౌదరి వర్గీయులుగా విడిపోయి ఉన్న కాంగ్రెస్‌కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతో జోష్ పెరిగినా…’కొత్త’ చిక్కులు వచ్చిపడ్డాయి. టిక్కెట్ల విషయంలో పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పొంగులేటి, భట్టి పోటీ చేసే నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని చోట్ల తుది రేసులో ఎవరు ఉంటారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. పార్టీ అంతర్గత సర్వే ఆధారంగా టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తున్న నేపథ్యంలో అంతిమంగా ఎవరు అభ్యర్థులనేది తేలేందుకు మరింత సమయం పట్టవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో నియోజకవర్గంలో రెండు నుంచి పదిమంది వరకు ఆశావహులు ఉన్నారు. ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మధిర నుంచి మల్లు భట్టివిక్రమార్క ఏకైక అభ్యర్థులైనా ఈ సెగ్మెంట్ల నుంచి కూడా టికెట్లు ఆశించేవారు లేకపోలేదు. ఖమ్మం నుంచి మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ మానుకొండ రాధాకిషోర్, కొత్తగూడెం ఎడవల్లి కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (పార్టీ మారితే), పొంగులేటి పోటీ చేయని పక్షంలో ఊకంటి గోపాల్‌రావు టికెట్లు ఆశించేవారిలో ఉన్నారు. మధిరలో డాక్టర్ కోట రాంబాబు ఆశిస్తున్నారు. భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్యకు తోడు పొంగులేటి అనుచరుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు పోటీపడుతున్నారు. అత్యధికంగా ఇల్లెందు నుంచి 10 మంది కోరం కనకయ్య, చీమల వెంకటేశ్వర్లు, బాణోత్ విజయలక్ష్మి, గుగులోత్ కిషన్‌నాయక్, డాక్టర్ రామచంద్రనాయక్, ఉపాధ్యాయసంఘం నేత లక్ష్మణ్‌నాయక్, కిషన్‌నాయక్, గుండెబోయిన నాగమణి, డాక్టర్ రవిబాబునాయక్, సేవాలాల్ సమితి వ్యవస్థాపకులు భూక్యా సంజీవ్‌నాయక్ టిక్కెట్ ఆశిస్తున్నారు. పినపాక నుంచి మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి, విజరుగాంధీ, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య కుమారుడు సంతోష్, ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు ధనసరి సూర్య, కాటిబోయిన నాగేశ్వరరావు, కణితి లక్ష్మణ్‌రావు ఏడుగురు పోటీపడుతున్నారు. అశ్వారావుపేట నుంచి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పొంగులేటి వర్గీయుడు జారె ఆదినారాయణ, సున్నం నాగమణి, టీచర్ ధంజునాయక్, మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన బంధువు వగ్గెల పూజ ఐదుగురి మధ్య టిక్కెట్ పోటీ నెలకొంది. సత్తుపల్లిలో మట్టా దయానంద్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, కొండూరు సుధాకర్, కోటూరు మానవతారారు, వైరా నుంచి విజయాబాయి, రాందాస్‌నాయక్, రామ్మూర్తినాయక్ టిక్కెట్ రేసులో ఉన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే పాలేరు నుంచి ఆమె పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా పొంగులేటి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి, రాయల నాగేశ్వరరావు, రామసహాయం మాధవీరెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డి, బెల్లం శ్రీనివాస్, రామసహాయం నరేష్‌రెడ్డి…ఇలా పలువురు టిక్కెట్ ఆశిస్తున్నారు. మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబీకులు ఎవరైనా బరిలో ఉండొచ్చంటున్నారు.కాంగ్రెస్ మద్దతు ఉంటే టీడీపీ తరపున వైరా నుంచి ఆరెం రామయ్య పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇల్లెందులో బీఎస్పీ నుంచి బాదావత్ ప్రతాప్, మధిరలో రాంబాబు టిక్కెట్‌రాని పక్షంలో బీఎస్పీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.
బలమైన శక్తిగా కమ్యూనిస్టులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా దీనిలో ఏడు సెగ్మెంట్లపై ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలు కేంద్రీకరించాయి. దీనిలో సీపీఐ(ఎం) ఐదు నియోజకవర్గాలు పాలేరు, మధిర, వైరా, భద్రాచలం సీట్లపై, సీపీఐ వైరా, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాలపై కేంద్రీకరించి పని చేస్తున్నాయి. భవిష్యత్తులో పొత్తులు, సీట్ల సర్దుబాటును బట్టి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలు ఐదు స్థానాలకు తగ్గకుండా పోటీ చేయాలని భావిస్తున్నాయి. అలా చేయాల్సి వస్తే సీపీఐ (ఎం) పాలేరు, మధిర, భద్రాచలం, సీపీఐ కొత్తగూడెం, వైరా స్థానాలలో పోటీ చేసే అవకాశం ఉంది. కమ్యూనిస్టుల మద్దతు, పోటీ అంశాలపైనే ఉమ్మడి జిల్లా రాజకీయ ముఖచిత్రం ఆధారపడి ఉంటుందని విశ్లేషకుల అంచనా.