ఖమ్మంలో అదానీ పంచాయితీ

– నేషనల్‌ హైవే, రైల్వేమార్గాలకు భూముల కోసం రాద్ధాంతం
– రైతుల నిరాకరణ.. రోడ్లెక్కి ఆందోళనలు
– మొండిగా వ్యవహరిస్తున్న కేంద్రప్రభుత్వం
– కార్పొరేట్ల వైపే మొగ్గు చూపుతున్న వైనం
– నేడూ ‘గ్రీన్‌ఫీల్డ్‌ హైవే’ సర్వే.. ఉద్రిక్తతకు చాన్స్‌
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జాతీయ ప్రాజెక్టుల భూసేకరణ విషయంలో కొన్ని నెలలుగా ఖమ్మం జిల్లాలో తీవ్ర రాద్ధాంతం నెలకొంది. కార్పొరేట్ల కోసం ఏర్పాటు చేస్తున్న రోడ్లు, రైల్వేమార్గాలతో జిల్లా రైతులు భారీ మొత్తంలో భూములు కోల్పోతున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితుల్లో కనీసం 70% మంది అయినా ఆమోదిస్తేనే భూసేకరణ చేయాలి. ప్రజాభిప్రాయ సేకరణలో వందశాతం నిరసనలు వ్యక్తమవుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తుండటంపై నిర్వాసితులు మండిపడుతున్నారు. రైల్వేలైన్‌, గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలకు కలిపి జిల్లాలోని 11 మండలాల్లో రెండువేల ఎకరాలకు పైగా భూములు, విలువైన ఆస్తులను రైతులు కోల్పోతున్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం చింతకాని మండలంలో ఆదివారం నిర్వహించిన సర్వే ఉద్రిక్తతతకు దారితీసింది. బాధితులు అడ్డుకున్న నేపథ్యంలో మంగళవారం మరోమారు సర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్‌ నిర్వాసితులకు మద్దతుగా నిలిచాయి. సర్వేను ఎట్టిపరిస్థితిలో కొనసాగనివ్వమని రైతులు గట్టి పట్టుదలతో ఉండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వేను ఆపోద్దని అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది.
పేరుకే ప్రజాభిప్రాయ సేకరణ..
పేరుకే ప్రజాభిప్రాయ సేకరణ అనే రీతిలో ఈ తతంగం నడుస్తోంది. అదానీ అండ్‌ కోకు మేలు చేసేందుకు మహారాష్ట్రలోని నాగపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతో పాటు డోర్నకల్‌ టూ మిర్యాలగూడ రైల్వేలైన్‌ నిర్మాణం విషయంలో జిల్లా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఈ రెండు జాతీయ ప్రాజెక్టుల కోసం సేకరిస్తున్న భూములు ఖమ్మం నగరానికి అత్యంత చేరువగా ఉండటం.. ఎంతో విలువైన ఖనిజ నిక్షేపాలతో పాటు సారవంతమైనవి కావడంతో రైతులు భూములిచ్చేందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు. పోనీ పరిహారం తగినట్టుగా ఉందా.. అంటే అదీ లేదు. రూ.కోట్లలో ఈ భూముల విలువ ఉంటే రూ.లక్షల్లో పరిహారం ఇస్తామంటున్నారు. దీనిపైచింతకాని మండలంలో ఆదివారం చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. భారీ పోలీసు బలగాలతో వచ్చిన రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రైల్వేలైన్‌ విషయంలోనూ ఖమ్మంరూరల్‌, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల రైతాంగం నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఈ రైల్వేలైన్‌ విషయంలో స్థానిక ఎంపీ, బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను కలిసి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎంపీ నామతో కలిసి ఢిల్లీ వరకూ వెళ్లి తమ అభ్యంతరాలు తెలిపారు. అయినా కేంద్రం ఈ పనులేవీ ఆపకుండా మొండిగా ముందుకు సాగుతోంది.
గ్రీన్‌ఫీల్డ్‌పై గరంగరం..
కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ నియోజకవర్గం నాగపూర్‌ నుంచి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించే గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం ఎక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినా నిరసనలే వ్యక్తమయ్యాయి. ఖమ్మం జిల్లాలో మధిర మండలం సిరిపురం, రఘునాథపాలెం మండలకేంద్రంలో రెండుసార్లు, ఇప్పుడు చింతకాని మండలంలో సర్వే విషయంలోనూ ఉద్రిక్త పరిణామాలే చోటుచేసుకున్నాయి. రైతులు ‘ప్రాణాలైనా తీసుకుంటాం…భూములు మాత్రం ఇవ్వం’ అని తేగేసి కూర్చున్నా రెండు వంద మందికి పైగా పోలీసు భద్రత మధ్య సర్వే తంతును అధికారులు కొనసాగించడం గమనార్హం. రైతులతో కలిసి సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు కొదుమూరు- చిన్నగోపతి రహదారిపై రాస్తారోకో చేశారు. ఎకరం రూ.1.50 కోట్ల విలువున్న భూమికి రూ.25 లక్షలతో సరిపెట్టి, భూములు లాక్కోవాలని చూస్తే సహించేది లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హెచ్చరించారు. మూడుసార్ల ప్రజాభిప్రాయ సేకరణను నిర్వాసితులు తిరస్కరించినా కేంద్రం మొండివైఖరిపై మండిపడ్డారు.
రైల్వేలైన్‌ విషయంలోనూ మొండిగా కేంద్రం..
డోర్నకల్‌- మిర్యాలగూడ రైల్వేలైన్‌ విషయంలోనూ కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది. అలైన్‌మెంట్‌ మార్చి ప్రత్యామ్నాయంగా మోటమర్రి- విష్ణుపురం మార్గాన్ని ఎంచుకోవాలని ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కలిసి విన్నవించారు. డోర్నకల్‌- మిర్యాలగూడ రైలుమార్గంతో ఖమ్మం రూరల్‌ మండలం జాన్‌బాద్‌తండా, బోడవీరా తండా, దారేడు, గుండాల తండా, గూడురుపాడు, ఎం.వెంకటాయపాలెం, ఆరెకోడు, ఆరెంపుల, బారుగూడెం, పొన్నెకల్‌, మద్దులపల్లి, తెల్దారుపల్లి, ముదిగొండ మండలం లక్ష్మీగూడెం, మేడేపల్లి, ధనియాగూడెం, కట్టకూర్‌, నేలకొండపల్లి మండలం ఆరెగూడెం, ఆచార్లగూడెం, కోనాయిగూడెం, నేలకొండపల్లి, బోదులబండ, పైనంపల్లిలో కలిపి సుమారు 600 ఎకరాలకు పైగా విలువైన భూములను రైతులు కోల్పోతారు.
ఉన్న భూమంతా పోతే 30 మంది ఉన్న మా కుటుంబం ఎట్లా బతకాలి..?
మేము ఐదుగురం అన్నదమ్ములం. మాకు కొదుమూరు రెవెన్యూలో సర్వే నంబర్‌ 125, 143లో ఐదు ఎకరాల భూమి ఉంది. ఉన్న భూమిలో ఎకరం సూర్యాపేట-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కింద పోతుంది. నాగపూర్‌- అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కింద నాలుగు ఎకరాలు పోతున్నాయి. ఉన్న భూమి మొత్తం పోతే మేము 30 మంది ఉన్న కుటుంబ సభ్యులం ఎట్లా బతకాలి? అరకొర పరిహారంతో మా బతుకులు ఏమి కావాలి? సర్వేను అడ్డుకొని తీరుతాం. అలైన్‌మెంట్‌ మార్చే దాకా విశ్రమించం.
రాచబంటి రాము, కొదుమూరు,
చింతకాని మండలం

Spread the love